Saturday, April 19, 2025
Homeఅంతర్జాతీయంమీడియా ముందు ట్రంప్-జెలన్ స్కీ వాగ్వివాదం..

మీడియా ముందు ట్రంప్-జెలన్ స్కీ వాగ్వివాదం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య శ్వేతసౌధంలో నిన్న జరిగిన భేటీ రసాభాసగా, అర్ధాంతరంగా ముగిసింది. మీడియా ముందే ఇద్దరూ తీవ్రంగా వాదులాడుకున్నారు. దీంతో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందాన్ని ఇక దయచేయమంటూ వైట్‌హౌస్ ఆదేశించింది. దీంతో జెలెన్‌స్కీ విసురుగా వెళ్లిపోతున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జెలెన్‌స్కీతో భేటీ కావడం ఇదే తొలిసారి. సమావేశానికి ముందు ట్రంప్, జెలెన్‌స్కీ ఒకరికొకరు చేతులు కలుపుకొని, చిరునవ్వుతో కనిపించారు. అయితే, రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని పరిష్కరించేందుకు దౌత్యం అవసరమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నొక్కి చెప్పడంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పత్రికా సమావేశాలలో రష్యాకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడే అధ్యక్షుడు నాలుగేళ్లపాటు అమెరికాలో ఉన్నారని జో బైడెన్‌ను ఉద్దేశించి జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఆ అధ్యక్షుడి మాటలతో చిర్రెత్తుకొచ్చిన పుతిన్ ఉక్రెయిన్‌పై దాడిచేసి గణనీయమైన భాగాన్ని నాశనం చేశారని అన్నారు. శాంతి, శ్రేయస్సు మార్గంతో దౌత్యం చేయవచ్చని పేర్కొన్నారు. దీనికి స్పందించిన జెలెన్‌స్కీ క్రిమియా సహా దేశంలోని పలు ప్రాంతాలను పుతిన్ 2014లో ఆక్రమించారని తెలిపారు. తాను కేవలం బైడెన్ గురించి, అప్పటి అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్ గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ ఆయనను అడ్డుకోగలరని, కానీ అప్పట్లో ఎవరూ ఆ పని చేయలేదని వివరించారు. పుతిన్ తమ ప్రజలను కూడా చంపారని అన్నారు. దీంతో స్పందించిన వాన్స్.. మీ దేశ విధ్వంసాన్ని అంతం చేసే దౌత్యం గురించి తాను మాట్లాడుతున్నానని చెప్పారు. మధ్యలోనే జోక్యం చేసుకున్న జెలెన్‌‌స్కీ ాాకానీ.. మీరు్ణ అంటూ అడ్డుకున్నారు. ఇది వాగ్వివాదానికి దారితీసింది. మీరు ఓవల్ ఆఫీసుకు వచ్చి మీడియా ముందు ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు. మీరు మా అధ్యక్షుడికి కృతజ్ఞతగా ఉండాలని పేర్కొన్నారు. ఇది క్రమంగా ఘర్షణకు దారితీసింది. యుద్ధ సమయంలో అమెరికా సహా ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయని జెలెన్‌‌స్కీ చెప్పారు. మీ వద్ద పరిష్కారాలు ఉన్నాయని, ఇప్పుడు అనుభూతి చెందవద్దని, భవిష్యత్తులో మీరు దానిని అనుభవిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు అనగానే ట్రంప్ కోపంతో ఊగిపోయారు. మేం ఏం అనుభూతి చెందుతున్నామో చెప్పాలని, మేం ఏం అనుభూతి చెందాలో మీరు నిర్దేశించలేరని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మీరు లక్షలాదిమంది జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ వద్ద అమెరికా ఆయుధాలు లేకపోతే యుద్ధం రెండు వారాల్లో ముగిసిపోయేదని అన్నారు. అధ్యక్షుల మధ్య ఈ వాగ్యుద్ధం తర్వాత జెలెన్‌స్కీ విసురుగా లేచి వెళ్లిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాకెక్కాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు