. మిర్చికి మద్దతు ధర కల్పించాలని వైసీపీ నిరసన
. పేదలకు అండగా నిలవడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్న
. కూటమి ఎదురుదాడి… పులివెందుల ఇళ్ల అక్రమాలపై ధ్వజం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో అధికార కూటమి, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం చైర్మన్ మోషేన్ రాజు ప్రశ్నోత్తరాల గంట ప్రారంభించ గానే... మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి ప్రశ్నకు గృహ నిర్మాణశాఖ మంత్రి సమాధానం చెబుతుండగానే వైసీపీ సభ్యులు కొద్ది సేపు వాకౌట్ చేశారు. అనంతరం బడ్జెట్‌పై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తరువాత ప్రజలకు మేలు జరిగే అవకాశాలు లేవన్న విషయం స్పష్టమవుతుందన్నారు. 8 నెలల్లోనే రూ.లక్షా 25వేల కోట్ల రూపాయలు అప్పుచేసిన ఏకైక రాష్ట్రం మనేదీనన్నారు. 2014-19 మధ్య జీడీపీ రాష్ట్ర వాటా 4.47శాతం ఉంటే..2019-24లో జీడీపీ రాష్ట్ర వాటా 4.83గా పెరిగిందని, దీని ఆధారంగా ఎవరి హయాంలో రాష్ట్రాభివృద్ధి జరిగిందో ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. 2019-24 మధ్యలో రాష్ట్ర జీడీపీ వాటా కేంద్ర జీడీపీ వాటా కంటే ఎక్కువ ఉందని, ఇది ఆర్థిక విధ్వంసం ఎలా అవుతుందని ప్రశ్నించారు. నాడు
నేడు ద్వారా ప్రాథమిక విద్యకు మౌలిక సదుపాయాలు కల్పించడా నికి రూ.32వేల కోట్లు వెచ్చించడం, సాంఘిక సంక్షేమం కోసం రూ.2లక్షల 72వేల కోట్ల డీబీటీ ద్వారా పేద ప్రజలకు అండగా నిలవడం విధ్వంసం అవుతుందా? అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో అమరావతిని సెల్ఫ్ సస్టెయిన్ అని చెప్పి..ఏపీ సీఆర్డీఏ కింద రూ.6వేల కోట్లు ఎలా కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ బదులిస్తూ…2019-24 మధ్య వరకు గత ప్రభుత్వం ఆర్థిక అరాచకం సృష్టించిందని, అన్ని వర్గాల వారికి మంచి జరిగేలా బడ్జెట్ ప్రవేశపెట్టా మని చెప్పారు. గత ప్రభుత్వంలో దాదాపు రూ.11వేల కోట్లు బడ్జెటేతర అప్పులు చేశామని, పోలవరం రివర్స్ టెండర్ పేరుతో దాదాపు 600 గ్రామాలకు నీళ్లు లేకుండా చేశార న్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి మంత్రులు అమరావతిని శ్మశానంతో పోల్చడమే కాకుండా..మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం సరైన బడ్జెట్ కేటాయింపులు చేయడం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బడ్జెట్ అంటే కేవలం అంకెల కూర్పు కాదని, బడ్జెట్ ప్రతిపాదనకు సంబంధించి ప్రజలకు మేలు చేకూర్చే కన్నా పాలక పార్టీల ఎన్నికల ప్రచార బడ్జెట్‌గా మర్చుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ గోపాల్‌రెడ్డి, బొర్రా గోపీమూర్తి మాడ్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ అమలుపై కమిషన్ వేయాలని, ఈలోపు ఐఆర్ ప్రకటించాలని పట్టుపట్టారు.ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల వ్యవసాయ జలాలకు సంబంధించిన కాలువలను తూటి తొలగించాలన్నారు. ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు నగర పరిధిలో చింతారెడ్డి పాలెం జంక్షన్ దగ్గర ప్లైఓవర్, సర్వీస్ రోడ్డు నిర్మించాలని కోరారు.
పులివెందులలో అక్రమాలపై విచారణ: మంత్రి పార్థసారథి
పులివెందులలో ఇళ్ల నిర్మాణ పథకంలో అక్రమాలపె టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, దువ్వారపు రామారావు, బి.తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నకు..గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమాధాన మిస్తూ.. పులివెందుల మున్సిపాల్టీలోని ఇళ్లస్థలాల లబ్ధిదారుల అర్హతపై విచారణ నిర్వహించడానికి కలెక్టర్, మున్సిపాల్టీల్లో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల అర్హత పై విచారణను నిర్వహించడానికి వైఎస్ఆర్ కడపజిల్లా కలెక్టరుతోపాటు ఆరుగురు అధికారులతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. 8603 మంది లబ్ధిదారుల కుగాను, 6153లబ్ధిదారులను అర్హులుగా కనుగొన్నారని, 2,450 మందిని అనర్హులుగా గుర్తించారని తెలిపారు. గనులు, భూగర్భ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 2019-24లో ఏపీఎండీసీ వాటాలను విదేశీ పెట్టుబడి దారులకు విక్రయించిన విషయంలో వాస్తవం లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలుపై మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు, మురుగుడు హనుమంతరావు అడిగిన ప్రశ్నకు..రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమాధానమిచ్చారు. అనంతరం మండలి సమావేశం అరగంట వాయిదా పడిరది. తిరిగి మండలి సమావేశం ప్రారంభకాగానే మిగిలిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా భావిస్తున్నామని చైర్మన్ ప్రకటించి.. మంగళ వారం ఉదయం 10గంటలకు మండలిని వాయిదా వేశారు.