Tuesday, March 4, 2025
Homeబీజేపీకి మద్దతిస్తే పునీతులే!

బీజేపీకి మద్దతిస్తే పునీతులే!

షెహ్లా రషీద్‌… హార్దిక్‌ పటేల్‌పై ‘దేశద్రోహం’ కేసుల ఉపసంహరణ

న్యూదిల్లీ : కాషాయ పార్టీ బీజేపీకి కొత్తగా ఏర్పడిన సాన్నిహిత్యం ఫలితంగా జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) మాజీ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్‌, పటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌పై ఉన్న దేశద్రోహ అభియోగాలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీ వ్యతిరేకులుగా ఇద్దరూ వేర్వేరు సంఘటనలలో అభియో గాలను ఎదుర్కొన్నారు. షెహ్లా రషీద్‌ జేఎన్‌యూలో విద్యార్థి నాయకురాలిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించారు. ఇటీవల ఆమె ప్రధాన మంత్రి మోదీకి గొప్ప అభిమానిగా మారింది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత సాయుధ దళాలు పిల్లలు, యువతపై దారుణంగా ప్రవర్తించాయని ఆరోపించినందుకు ఆమెపై దేశద్రోహం కేసు నమోదయింది. భారత శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమెపై విచారణకు అనుమతి మంజూరు చేశారు. అయితే 2019 నాటి దేశద్రోహ కేసులో ఆమెపై విచారణను ఉపసంహరించుకోవాలని దిల్లీ పోలీసులు దాఖలు చేసిన దరఖాస్తును గురువారం (ఫిబ్రవరి 27) దిల్లీ కోర్టు స్వీకరించిందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ నివేదించింది. గత సంవత్సరం డిసెంబరులో రషీద్‌పై కేసును ఉపసంహరించుకోవాలని స్క్రీనింగ్‌ కమిటీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఆ తర్వాత దిల్లీ పోలీసులు కేసును ఉపసంహరించు కోవాలని కోరుతూ పాటియాలా హౌస్‌ కోర్టులోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అనుజ్‌ కుమార్‌ సింగ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హార్దిక్‌ పటేల్‌ పైనా ఉపసంహరణ
2015 పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించిన బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్‌ పటేల్‌తో పాటు మరో నలుగురిపై దాఖలయిన దేశద్రోహం కేసును ఉపసంహరించుకునేందుకు అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు గుజరాత్‌ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ నిబంధనల ప్రకారం స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుధీర్‌ బ్రహ్మభట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అదనపు సెషన్స్‌ జడ్జి మనీష్‌ పురోహిత్‌ ఈ మేరకు శనివారం (మార్చి 1) రెండు ఉత్తర్వులు జారీ చేశారు. హార్దిక్‌ పటేల్‌, దినేష్‌ బంభానియా, చిరాగ్‌ పటేల్‌, కేతన్‌ పటేల్‌, అల్పేష్‌ కతేరియా 2015లో ‘చట్టబద్ధంగా, సామాజికంగా అసాధ్యమని’ తెలిసినప్పటికీ, పటీదార్‌ లేదా పటేల్‌ కమ్యూనిటీ సభ్యులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆందోళనకు ప్రేరేపించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 124ఎ (విద్రోహం), 121 (యుద్ధం చేయడం లేదా యుద్ధం చేయడానికి ప్రయత్నించడం లేదా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రేరేపించడం), 153ఎ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) అతనిపై సెక్షన్‌ 153బి (ఆరోపణ, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే ప్రకటనలు) కింద అభియోగాలు మోపారు. గత నెలలో బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటు న్నట్లు ప్రకటించిన తొమ్మిది పటీదార్‌ కోటా ఆందోళన కేసుల్లో ఇది ఒకటి. 2015 పటీదార్‌ ఉద్యమానికి సంబంధించి దాదాపు 300 కేసులు నమోదయ్యాయి. అయితే, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పటేల్‌, ఇతరులపై కేసును ఉపసంహరించుకోవాలని ఫిబ్రవరి 18, 2025న జిల్లా మేజిస్ట్రేట్‌ రాసిన లేఖ ద్వారా ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు తెలియజేసింది.
గతంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన పటేల్‌ కాంగ్రెస్‌ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ 2022 గుజరాత్‌ ఎన్నికలకు ముందు పార్టీని విడిచిపెట్టాడు. ఆయన బీజేపీలో చేరిన తరువాత శాసనసభ్యుడు అయ్యాడు. ఉమర్‌ ఖలీద్‌ జైలులో కొనసాగుతున్న విషయాన్ని సూచిస్తూ, ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌… రషీద్‌ పటేల్‌పై ఉన్న కేసుల ఉపసంహరణను ‘వాషింగ్‌ మెషిన్‌’ అని అభివర్ణించారు. ‘దిల్లీ పోలీసులు షెహ్లా రషీద్‌పై 2019 దేశద్రోహ కేసును ఉపసంహరించుకున్నారు. హార్దిక్‌ పటేల్‌పై దేశద్రోహ కేసును ఉపసంహరించుకోవడానికి గుజరాత్‌ ప్రభుత్వానికి అహ్మదాబాద్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. ఉమర్‌ ఖలీద్‌ లాగా లొంగిపోయేందుకు నిరాకరించిన వారు ఇప్పటికీ 5 సంవత్సరాలుగా బెయిల్‌ కూడా లేకుండా జైలులో ఉన్నారు. చట్టం తనదైన రీతిలో నడుస్తుందా లేదా రాజకీయాలు ‘వాషింగ్‌ మెషిన్‌’ పాత్ర పోషిస్తున్నాయా? సందేశం చాలా స్పష్టంగా ఉంది : వైపులా మారండి, అంతా బాగానే ఉంటుంది!!’ అని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు