చింతపట్ల సుదర్శన్
కాగితాలు నమిలే గాడిదలకు కూడా ‘టేస్టు’ ఉంటుంది. రకరకాల వాల్ పోస్టర్లలో సినిమా హీరోలవి నమిలినప్పుడు ఉండే రుచికీ, రాజకీయ నాయకులవి చించి చెండాడినప్పుడు ఉండే రుచిలో తేడా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుడు అధికార పక్షం వాడైతే మరింత రుచి అనుకుంటూ డాంకీ గోడల వంక చూడసాగింది. ఏ పోస్టర్ తింటే ఈ రోజుకి రుచిగా ఉండడమే కాక కడుపు నిండుతుందన్న ఆలోచనతో.
టేస్ట్‌బడ్సు అనేవి మనుషులకేనా మాకు లేనే లేవా? అనుకుంటూ డాంకీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఓ లీడర్ లైఫ్ సైజ్ ఫోటోను సెలెక్టు చేసుకుని దాన్ని సమీపించింది. కంటికి, నోటికి ఇంపుగా ఉండే తిండి చూస్తే ఎవరికైనా పరవశం కలగకపోదు. అలా పారవశ్యంతో కళ్లు రెండూ మూసుకుని, నోరు తెరిచి పళ్లు బయటపెట్టిందో లేదో కల చెదిరింది. కథ మారింది. ఎక్కడ్నించి వచ్చిందో ఓ డర్టీ డాగ్ నోరు పెద్దగా తెరిచి ‘భౌభౌ’ మని అరుపు లంకించుకుంది.
డాంకీ తినబోతున్న తిండి నోటికి అందకుండా చేసిన ఆ డాగ్ కేసి కోపంగా చూసింది. వాట్ నాన్సెన్స్! నా పొట్ట తిప్పలేదో నేను పడుతుంటే ఇది అసెంబ్లీలో విపక్ష సభ్యుడిలా నోరు పారేసుకుంటున్నదేమిటి? అని వెనక్కి తిరిగి తల విదిలించింది. వీధి కుక్క మాత్రం తన నోటిని అదుపులో పెట్టుకోకుండా, తనలో ఏ సిద్ధాంతం విషయంలోనూ అభిప్రాయ భేదం లేని, తనలో ఎటువంటి జాతి వైరం లేని డాంకీని బెదిరిస్తూ, పైపైకి వస్తూ అరుస్తూనే ఉంది.
ఎప్పుడూ చూసి ఉండని, ఎలాంటి పరిచయమూ లేని ఈ కొత్త డాగ్ ఎక్కడిది ఒక డాగీతో ఫ్రెండ్లీగా కల్సి ఒకే రూఫ్ కింద జీవిస్తున్న తనతో దీనికేమి పగ. ఇది అరిచి గీపెట్టి, నేను నవలకుండా ఆపిన రాజకీయ నాయకుడికీ దీనికీ ఏదైనా బంధమో అనుబంధమో లేదు కదా అనుకున్న డాంకీ, దీని అరుపులకి తలవంచి మరో గోడనీ మరో సర్కారీ లీడర్నీ చూసుకోక తప్పదా అని అనుకుంటున్న సమయంలో డాంకీ అక్కడికి వచ్చింది. హమ్మయ్య! మనవాడు వచ్చాడు. బతుకు జీవుడా! అనుకున్నది.
అప్పట్నుంచీ పెయిడ్ సర్వీసు చేస్తున్న వాడిలా ఉన్న వీధి కుక్క గుక్క తిప్పుకుని నాలుక చప్పరిస్తూ నిలబడిరది. ఏయ్! ఎవర్నువ్వు. ఊరికీ, ఈ వాడకీ కొత్తా! ఐడీ కార్డూ, ఆధార్ కార్డూ ఉన్నయా బంగ్లాదేశీవా, రోహింగ్యావా అనడిగింది డాగీ, డాంకీ పక్కన గన్‌మెన్‌లా నిలబడి. డాగీ ఎత్తూ పొడవూ, గొంతులో నేటివిటీ చూసి అరిచే కుక్క జంకింది. తను మరీ రెచ్చిపోతే తను లోకల్ గనుక లోకలోళ్లని కేకేసినా చెవులు కొరికేసినా కొరికేయగలదు అనుకుంది.
ఈ డాంకీ నేనూ జాతి భేదంలేని జిగ్రీ దోస్తులం తెల్సా! ఈ ఊళ్లో అందరికీ తెల్సిన విషయం నీకు తెలీదా? ఎక్కడ్నించో పొట్ట చేత పట్టుకు వచ్చినట్టున్నావు. జాగ్రత్తగా మసలుకో. అసలు డాంకీ కూడా మనలాగే ఎనిమల్ కదా. పైగా నువ్వూ నేనూ ఏరుకు తినే ఎముకలకు ఆశ పడదు కదా. సినిమా పోస్టర్లూ, పళ్లికిలించే లీడర్ల ఫొటోలూ నమిలే సాధు జంతువు కదా. ఇట్లాంటి, ఏ పార్టీకి చెందని న్యూట్రల్ ప్రాణి మీద, అరవడం సబబు కాదు అంది డాగీ డాగీ భాషలో.
సారీ బ్రో! నేను ఈ డాంకీని చూసి అరవాలని అనుకోలేదు. కొత్తగా వచ్చాను కదా. ర్యాగింగ్ చేద్దామనుకుందేమో ఈ పక్కనే ఉండిన ఓ నల్ల మచ్చల తెల్లకుక్క, నన్ను బాగా అరిచి గీపెట్టి ఈ గాడిదను భయపెట్టి ఇక్కడ్నించి తరిమేయమంది. అందుకే అంటూ…నసిగింది వీధికి కొత్తగా వచ్చిన వీధి కుక్క.
ఎవరు ఏది వాగమంటే అది వాగేస్తావా? ముందూ వెనుకా చూసుకోవా! ఎవడి పనివాడు చేసుకోవాలి కాని అనవసరంగా ఎవరినీ కెలకవద్దని తెలీదా అని డాగీ కోప్పడ్డంతో వీధికుక్క గప్‌చిప్‌గా అక్కడ్నించి వెళ్లిపోయింది. ఆ దారినే పోతున్న అబ్బాయి డాగీని డాంకీని చూసి ఇటు వచ్చాడు. ఏంటి డాగీ ‘బ్రో’ ఏదయినా ప్రాబ్లమా? అనడిగాడు. అంతా అయిపోయేక వచ్చే పోలీసోడిలా వచ్చావు తంబీ అంది డాంకీ ఆ వెంటనే సారీ! జస్ట్ కిడ్డింగ్! అంది.
అది చెప్పిందట ఇది అరిచందట. ‘ఉస్కో’ అంటే చాలు కుక్క బుద్ధి అంతే అంది డాగీ. ఇది మనుషుల్లో ముఖ్యంగా రాజకీయాల్లో మామూలే. ప్రతిపక్షం వాళ్లు ‘ఉస్కో’ అనడానికి ఒకరిని, అధికార పక్షం వాళ్లు ‘ఉస్కో’ కు ‘ఉస్కో’ అని రెచ్చగొట్టడానికి ఒకరిని ఫిక్స్ చేసుకుంటారు. వీళ్ల పనల్లా నోటి దూల అనే కార్యక్రమం నిర్వహించడమే. ఇది అనాలి ఇది అనకూడదు అనే సెన్సార్ కటింగ్ లేకుండా నోరు తిమ్మిరి పుట్టేట్టు, దవడలు నొప్పి పుట్టేట్టు అరిచే ‘స్పోక్స్‌మన్’లు అన్ని పార్టీల్లోనూ ఉంటారు అన్నాడు అబ్బాయి. అవునవును ఇలాగే తనకు అవసరంలేని పనిలో వేలుపెట్టి, నోరు నొప్పెట్టిన ఓ వెండి తెర మనిషి జైలు ఊచలు లెక్కపెట్టడానికి వెళ్లాట్ట గదా అంది డాంకీ. వాళ్లూ వాళ్లూ సవాలక్ష తిట్లు తిట్టుకుంటారు, టన్నుల కొద్దీ బురద చల్లుకుంటారు. కానీ సమావేశాల్లో షేక్‌హేండ్లు ఇచ్చుకుని, కావలించుకుంటారు. వారందరిదీ ఒకే జాతి మరి. మరో రంగంలో వాడు తలపెడితే ఇరుక్కుపోడూ అంది డాగీ.