ఆర్వీ రామారావ్
భారత ప్రజా నాట్య మండలి (ఇప్టా) అవతరణ వెనక రెండు ప్రధాన ఘట్టాలున్నాయి. ఆ సమయంలో స్వాతంత్య్రోద్యమం తార స్థాయిలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న రోజులవి. కనీవినీ ఎరగని బెంగాల్ కరవు మొత్తం దేశాన్నంతటినీ అతలాకుతలం చేస్తోన్న సమయంలో బొంబాయిలోని….పాఠశాలలో ప్రజా నాట్య మండలి అవతరించింది. సోవియట్ యూనియన్ మీద ఫాసిస్టుల దాడికి వ్యతిరేకంగా జనంలో చైతన్యం కలిగించడం కోసం ప్రజా నాట్య మండలి ఏర్పాటు అవసరం అయింది. ఆ సమయంలో కళాకారులు కూడా తమ కళా రూపాల ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి తోడ్పడాలని భావించారు. అందుకే ఆ రోజుల్లో ప్రసిద్ధులైన రంగ స్థల నటులు, కళాకారులు ఐక్యమయ్యారు.
ప్రజానాట్య మండలిలో పని చేసే వారిలో ఎక్కువ మందికి వామపక్ష భావాలు ఉండేవి. కానీ నిర్దిష్టమైన రాజకీయాలు లేని వారు కూడా ఆ మహోద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రజా నాట్యమండలి ఏర్పాటు వెనక 1936లో ఏర్పడిన అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీలంగా ఉన్న వారి పాత్రా ఉంది. సినీ రంగ ప్రముఖులు పృథ్వీ రాజ్ కపూర్, ప్రముఖ రచయిత ముల్క్ రాజ్ ఆనంద్, బలరాజ్ సాహ్నీ, ఉత్పల్ దత్ వంటి వారు ఆ నాడు ప్రజానాట్య మండలిలో భాగస్వాములే.
బెంగాల్ కరవు నేపథ్యంలో నబన్నా (కొత్త పంట) నాటకం వచ్చింది. జ్యోతిరింద్ర మొయిత్ర నాటకం నవ జిబొనోర్ కూడా ఆ సమయంలోనే వచ్చింది. అలాంటిదే మరో నాటకం జీబొనేర్ గాన్. ప్రజానాట్య మండలి ధర్తీకే లాల్ సినిమా కూడా తీసింది. ఇవన్నీ ఆ నాటి జన చైతన్యాన్ని వ్యక్తం చేసినవే.
దిల్లీ విశ్వవిద్యాలయంలోని ఇంద్రప్రస్థ మహిళా కళాశాలలో ప్రజానాట్య మండలి ప్రత్యేక విభాగమే పని చేసేది. ఆ విభాగం బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక నాటకాలు ప్రదర్శించేది. ఈ ప్రజానాట్య మండలి విభాగం పత్రికలలో తమ కార్యక్రమాల వివరాలు ప్రచురించడానికి వీలుండేది కాదు. అందుకని కాగితం మీద పెన్నుతో రాసి గోడల మీద అంటించి సమాచారం తెలియజేసే వారు. 1950లు, 1960లలో బాలీవుడ్ చిత్రరంగం మీద ప్రజానాట్య మండలి ముద్ర చాలా బలమైంది. అనేకమంది సినీ దర్శకులు, నటులు, స్క్రిప్టు రచయితలు, కోరియోగ్రాఫర్లు ప్రజానాట్యమండలిలో మొలకెత్తి మహా వృక్షాలు అయిన వారే. సినీ గేయ రచయితలు మజ్రూప్‌ా సుల్తాన్ పురి, సాహిర్ లుధియాన్వీ, సైలేడ్ర, కైఫీ ఆజ్మీ ఆయన భార్య షౌకత్ ఆజ్మీ (హైదరాబాద్ వాసి) ప్రజానాట్యమండలి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే వారు. సినీ దర్శకులు హేమంత్ కుమార్, సలీల్ చౌదరీ ప్రజానాట్య మండలి సుందర వనంలో పూసిన పూలే.
దేశ విభజన జరిగినప్పుడు అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి ఆ మత విద్వేషాగ్నిని చల్లార్చడానికి స్వయంగా రంగంలోకి దిగాయి. ప్రసిద్ధ నటుడు పృద్వి రాజ్ కపూర్ తన ఇద్దరు కుమారులు రాజ్ కపూర్, షమీ కపూర్‌తో కలిసి లారీ మీద తిరుగుతూ బొంబాయిలో మత కలహాలను నిరోధించడానికి ప్రయత్నించారు. విచిత్రం ఏమిటంటే బ్రిటిష్ పాలనలో ప్రజానాట్య మండలి లాంటి సంస్థల కార్యకలాపాల మీద ప్రభుత్వం కన్నెర్ర చేయడం సహజమే. కానీ స్వాతంత్య్రానం తరం కూడా ప్రజానాట్య మండలి ప్రభుత్వ దమనకాండ ఎదుర్కోవలసి వచ్చింది. క్రమంగా ప్రజా నాట్య మండలికి చెందిన వారు ఈ సంఘం నుంచి దూరమై ఇతర కళాకారుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. వామపక్ష ఉద్యమంలో వచ్చిన చీలికలు కూడా సఫ్దర్ హాష్మీ లాంటి వారు జన నాట్య మంచ్ ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. అయినా ఈ సంఘాలు ఇప్పటికీ ప్రజా సమస్యలకు కళా రూపం ఇస్తూనే ఉన్నాయి. ప్రజానాట్య మండలిలో పని చేసే వారు ఇప్పటికీ సమానత్వం కోసం తిరుగుబాటు తత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.