జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ కోసం పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, సీఎం కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ పెట్టాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమం కోసం హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్డిసిని నోడల్ అధికారిగా నియమించాలని, ఇన్విటేషన్ కార్డు తయారు చేయాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2కే మారథాన్ నిర్వహించాలని, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, మహిళలకు హెల్త్ చెకప్ చేయాలని, మెడికల్ క్యాంపులు పెట్టాలని, న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళలను సన్మానించాలన్నారు. మహిళా అధికారులు కూడా హాజరుకావాలని, ఈ కార్యక్రమం కోసం మినిట్ టు మినిట్ తయారు చేయాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డిసిసి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మాలోల, ఐసిడిఎస్ పిడి బిఎన్.శ్రీదేవి, ఎల్డిఎం నర్సింహారావు, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, మెప్మా పిడి విశ్వజ్యోతి, ఏడిసిసి బ్యాంక్ సీఈవో సురేఖ రాణి, ఓఎన్డిసి నోడల్ అధికారి ఇషాంత్, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, బ్యాంకర్లు, ఐసిడిఎస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.