క్లస్టర్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించిన అధికారులు
విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరంలో 35 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో హ్యాండ్లూమ్ జెడి రాజారావు, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, ఆర్డిఓ మహేష్, ఎమ్మార్వో నటరాజ్,ఇతర అధికారులు కలిసి స్థల పరిశీలన చేసి ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని ప్రణాళికలను సమీక్షించారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ధర్మవరానికి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తానని హామీఇచ్చిన మంత్రివర్యులు ప్రస్తుతం ఆ హామీ నెరవేర్చే విధంగా అడుగులు వేస్తున్నారు అని తెలిపారు. గత జులై నెలలో క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని కలసి ధర్మవరంలో చేనేత రంగం అభివృద్ధి కోసం మెగా క్లస్టర్ ఏర్పాటుకు సహకారం అందించాలని కూడా కోరడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హ్యాండ్లూమ్ జేడీ స్థల పరిశీలనకు ధర్మవరంకు రావడంతో నేతన్నల కలలు త్వరలోనే సాకారమవనున్నాయి అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హ్యాండ్లూమ్ పరిశ్రమకు పునరుద్ధరణ, మరింత అభివృద్ధి సాధన లక్ష్యంగా పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని,
ఈ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ప్రాజెక్ట్ ద్వారా, స్థానిక కూలీలకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అలాగే దేశ వ్యాప్తంగా , అంతర్జాతీయంగా హ్యాండ్లూమ్ ఉత్పత్తుల మార్కెట్‌ను పెంపొందించడమే లక్ష్యం అని తెలిపారు. ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం లభించనుందని వారు స్పష్టం చేశారు. ఈ క్లస్టర్ నిర్మాణం పూర్తి అయిన తరువాత, ధర్మవరం ప్రాంతం హ్యాండ్లూమ్ పరిశ్రమలో దేశంలోనే ఒక ప్రముఖ కేంద్రంగా మారనుందని చెప్పారు. మంత్రివర్యులు సత్య కుమార్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ ధర్మవరం అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారని, ముఖ్యంగా ఎన్నికల హామీలను నిలబెట్టుకొనే విధంగా అడుగులు వేస్తున్నారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.
ధర్మవరంలో 35 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు – మంత్రి సత్య కుమార్ యాదవ్
RELATED ARTICLES