ఆర్వీ రామారావ్
ప్రస్తుతం సి.పి.ఐ. భావజాలానికి దగ్గరగా ఉన్న అనేక ప్రజాసంఘాలలాగే కార్మికవర్గానికి ప్రాతినిధ్యం వహించే అఖిలభారత ట్రేడ్ యునియన్ కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి.) కమ్యూనిస్టు పార్టీకన్నా ముందే 1920 అక్టోబర్ 31న ఏర్పడిరది. లాలా లజపత్ రాయ్ ఎ.ఐ.టి.యు.సి. మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కార్మిక సంస్థ ఏర్పాటులో జోసెఫ్ బాప్టిస్టా, ఎన్.ఎం.జోషి, దివాన్ చమన్ లాల్ మొదలైన వారు ప్రధాన పాత్ర పోషించారు. 1920లలో కమ్యూనిస్టు పార్టీ మూలాలు ప్రధానంగా కార్మికవర్గంలోనే ఉండేవి. సోషలిజం, మార్క్సిజం ప్రభావం మేధావి వర్గంలో బలంగా ఉండేవి. ఎ.ఐ.టి.యు.సి. ఏర్పాటును జాతీయోద్యమంలోని చాలా మంది ఆహ్వానిం చారు. 1920 నుంచి 1928వరకు ఎ.ఐ.టి.యు.సి. నాయకత్వం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి నాయకత్వం లోనే ఉండేది.
కమ్యూనిస్టు పార్టీ ఏర్పడకముందే సింగారవేలు మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు 1923లో దేశంలో మొట్టమొదటి సారి నిర్వహించిన మేడే ఉత్సవాల సందర్భంగా ప్రకటించారు. ఆ సమావేశంలో బహుశా మొట్ట మొదటి సారి అరుణ పతాకం మన దేశంలో ఎగురవేశారు. 1920 నాటికే మన దేశంలో కార్మిక సంఘాలు ఏర్పాటు కావడం మొదలైంది. 20వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాల్లో బొంబాయి, కలకత్తా, మద్రాసు, కాన్పూర్, కరాచీలాంటి చోట్ల పారిశ్రామిక కార్మికులు సంఘటితం కావడం మొదలైంది. ఈ కార్మికవర్గమే కమ్యూనిస్టు ఉద్యమానికి, సీపీఐకి చోదక శక్తిగా ఉపకరించింది. జౌలి, గనులు, ఓడ రేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు, రైల్వేలలాంటి రంగాలలో పని చేసే వారు కార్మికోద్యమానికి అండగా ఉన్నారు. ఆ దశ లోనే కనీస వేతనాలు అన్న భావన బలపడిరది.
ఎ.ఐ.టి.యు.సి. వ్యవస్థాపక మహాసభలో లాలా లజపత్ రాయ్ చేసిన ప్రసంగం చాలా విశిష్టమైంది. ఆ ప్రసంగంలో ఆయన వర్గ పోరాటం, సోషలిజం కోసం పోరాటం, సోషలిస్టు సమాజానికి సోవియట్ యూనియన్ ఎలా ఆదర్శప్రాయమైందో మాట్లాడారు. లజపత్ రాయ్ కమ్యూనిస్టు కాడు. కానీ ఆయన కాంగ్రెస్‌లో అతివాద వర్గానికి ప్రతినిధి. ఆ తరవాత కమ్యూనిస్టులు ఎ.ఐ.టి.యు.సి.లో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభం అయింది. ఆ దశలోనే ఎ.ఐ.టి.యు.సి. వామపక్ష భావజాలం వైపు మొగ్గడం మొదలైంది. డాంగే, ఘాటే, మిరాజ్కర్, ముజఫ్ఫర్ అహమద్, సింగారవేలు, జోగ్లేకర్, అజయ్ ఘోష్, పి.సి.జోషి, షాపూర్జీ సక్లత్వాలా లాంటి ఎందరో కార్మికవర్గంలో రాజకీయ చైతన్యం రగిలించడానికి కృషి చేశారు.
ఎ.ఐ.టి.యు.సి.లో రాజకీయ చైతన్యం పెరగడంతో వివిధ ప్రాంతాలలో కార్మిక బృందాలు సంఘటితమయ్యాయి. మార్క్సిస్టు దృక్పథంతో పత్రికల ప్రచరణ కూడా ఆరంభమైంది. డాంగే ‘‘సోషలిస్ట్’’ పత్రిక, ముజఫ్ఫర్ అహమద్ ‘‘లంగల్’’ పత్రిక, సింగారవేలు ‘‘లేబర్ కిసాన్ గజెట్’’ ప్రచురించేవారు. వీరు ఆర్థిక, రాజకీయ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. డాంగే మార్క్సిస్టు సిద్ధాంతవేత్త పాత్ర పోషిస్తూ కమ్యూనిస్టు, కార్మిక ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉండేవారు. ఆయన కేవలం కార్మిక సంఘ నాయకుడు కాదు. మొత్తం కార్మికవర్గానికే నాయకుడిగా ఎదిగారు. 1921లోనే డాంగే ‘‘గాంధీ వర్సెస్ లెనిన్’’ అన్న గ్రంథంలో వారి రాజకీయ సిద్ధాంతాలను విశ్లేషించారు. ఇవి కమ్యూనిస్టులకు కరదీపికలుగా ఉపకరించాయి. వివిధ సమస్యలను మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించడం ఆ రోజుల్లో డాంగే చేసిన మహత్తరమైన పని. ఇదే వరసలో ఆయన చరిత్ర, తత్వశాస్త్రం, భారతీయ సంప్రదాయాలు మొదలైన అంశాలను కూడా మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించేవారు. మొదటి తరం భారతీయ మార్క్సిస్టులకు అవే స్పష్టమైన అవగాహన కల్పించాయి. ఈ భావాల వ్యాప్తికీ ఆయన ‘‘సోషలిస్ట్’’ పత్రికను వినియోగించుకున్నారు. ఈ దశలోనే హోమీదాజీ, గురు రాధాకృష్ణ, హెచ్.ఎల్. పర్వానా, సరోజ్ పాండే, దర్శన్ సింగ్ కెనెడియన్, అవతార్ సింగ్ మల్హోత్ర కార్మికవర్గ నాయకులుగా ఎదిగారు.
బ్రిటిష్ పాలనలోనే మన దేశంలో కార్మికవర్గం గుర్తించగల స్థాయిలో తయారైంది. వలసవాద పాలనలో అప్పటివరకు ఉన్న స్వయం సమృద్ధ గ్రామీణ వ్యవస్థ ఓ వేపు ధ్వంసం అవుతూ ఉండగా మరో వేపు నుంచి క్రమంగా కార్మికవర్గం పెరగడం ప్రారంభమైంది. ఈ క్రమంలో రైతులు పేదవారైపోయారు. విదేశాల నుంచి చౌకైన పారిశ్రామిక వస్తువులు దిగుమతి కావడంతో మన సంప్రదాయ పరిశ్రమలు ధ్వంసం అయిపోయాయి. దీనివల్ల చేతివృత్తులు నాశనం అయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1917లో రష్యాలో విప్లవం సఫలం కావడం మన దేశంలో కార్మికోద్యమం బలపడడానికి ఊతం ఇచ్చింది. 1919లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) ఏర్పడడం కూడా ఎ.ఐ.టి.యు.సి. ఏర్పాటుకు దోహదం చేసింది.