Thursday, March 6, 2025
Homeసంపాదకీయంభాష పేరుతో చిచ్చు

భాష పేరుతో చిచ్చు

‘‘రాజ్యాంగంలో ఉన్న అంశాల ఆధారంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తాం. బహుభాషా విధానాన్ని ప్రోత్సహిం చడం ద్వారా జాతీయ ఐక్యతను పెంపొందింప చేస్తాం. ఇందులో మరింత వెసులుబాటు ఉంటుంది. ఏ భాషనూ ఏ రాష్ట్రం మీద రుద్దబోం’’ అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. కానీ దేశ వ్యాప్తంగా హిందీని రుద్దడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రధానమంత్రి మోదీకి హిందీ మాతృ భాష కాదు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకూ మాతృ భాష కాదు. కానీ బీజేపీ మొదటి నుంచి వేళ్లూను కున్నది హిందీ మాట్లాడే ప్రాంతాల్లోనే కనక హిందీ మాట్లాడని రాష్ట్రాల మీద కూడా ఆ భాషను రుద్దాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలో లేక ముందు కూడా త్రిభాషా సూత్రం ప్రస్తావన ఉండేది. 2000 సంవత్సరం నాటి జాతీయ పాఠ్య ప్రణాళికలో కూడా ‘‘త్రిభాషా సూత్రం జాతీయ ఏకాభిప్రాయం ఫలితంగా కుదిరింది. బహుభాషా విధానాన్ని, జాతీయ సామరస్యాన్ని ప్రోత్సహించడానికి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి’’ అని పేర్కొన్నారు. 2005, 2023 నాటి జాతీయ పాఠ్య ప్రణాళికలోనూ ఇదే మాట చెప్పారు. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటారు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఒక భాష మాత్రమే వచ్చిన వారికి ఏ భాషా రానట్టే అని భాషా శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. అన్ని రాష్ట్రాల వారికి అర్థమయ్యే రీతిలో దేశ వ్యవహారాలు నడపడానికి ఒక అనుసంధాన భాష అవసరం అన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉండనవసరం లేదు. కానీ ఆ అనుసంధాన భాష ఏది అనే విషయంలో పేచీలు దశాబ్దాలు గడిచినా తెగడం లేదు. హిందుస్థానీని అనుసంధాన భాషగా చేయాలన్న భావన జాతీయోద్యమ సమయంలో గాంధీ, నెహ్రూ లాంటి వారికి ఉండేది. హిందుస్థానీ అంటే ఉర్దూ-హిందీ సమ్మిళిత భాష. అదే సర్వజనామోదం పొంది ఉంటే పేచీ ఉండేది కాదు. హిందీని అందరిపై రుద్దాలనుకునే వారు హిందుస్థానీ స్థానంలో హిందీని ప్రతిష్ఠించాలని చూశారు. అందువల్లే అవసరమైనంత కాలం ఇంగ్లీషు వాడాలన్న నిర్ణయానికి వచ్చారు. కొఠారీ కమిషన్‌గా ప్రసిద్ధమైన విద్యా కమిషన్‌ 1964-66 లో అధికారి కంగా త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. దీనిని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1968 లో జాతీయ విద్యా విధానంలో భాగంగా అంగీకరించారు. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985లో మళ్లీ ఇదే పని చేశారు. 1992 లో పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఇదే విధానం అనుసరించారు. విద్యార్థులు తమ మాతృ భాష లేదా ప్రాంతీయ భాష, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే అధికార భాష, ఈ రెండిరటితో పాటు భారతీయ భాషల్లో ఒక ఆధునిక భాష లేదా ఒక యూరప్‌ భాష నేర్చుకోవాలని సూచించారు. అయితే అన్ని రాష్ట్రాలతో వ్యవహారం నడపడానికి కేంద్రం ఒక భాషను, ప్రధానంగా భారతీయ భాషను అమలు చేసే అవకాశం రానే లేదు. అందుకే అవసరమైనంత కాలం ఇంగ్లీషును వాడుకోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు అవకాశం ఉన్న వారంతా రెక్కలు కట్టుకుని అమెరికాలోనో మరో దేశంలోనో వాలి పోవాలనుకుంటారు కనక ఇంగ్లీషు నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిరది. నిజానికి యూరోపియన్‌ దేశాల్లో అన్ని చోట్లా ఇంగ్లీషు చెలామణిలో ఉండదు. జర్మనీలో చదువుకోవాలంటే ఆ భాష నేర్చుకోవలసిందే. లేదా అనువాద సౌలభ్యమైనా ఉండాలి. వెరసి అలాంటి దేశాలలో బోధన వారి భాషల్లోనే సాగుతుంది.
అవసరమైనంత కాలం ఇంగ్లీషును వాడుకోవచ్చు అన్న సూత్రాన్ని పాటిస్తే కొంప మునిగేది ఏమీ లేదు. కానీ బీజేపీ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం హిందీని అన్ని రాష్ట్రాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నందువల్ల దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధానంగా తమిళనాడు నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. భాష ఎన్నడూ రాజకీయాలకు అతీతంగా ఉండదు. ఎవరి భాష వారికి ప్రీతిపాత్రమైందే. కానీ ఇతర భాషల వారితో సంబంధాలు ఉండాలంటేనే మరో భాష తెలియాల్సిన లేదా నేర్చుకోవలసిన అవసరం వస్తుంది. దీన్ని ఎవరి అవసరానికి తగ్గట్టు వారికి వదిలేస్తే సమస్యే లేదు. కానీ హిందీని రుద్దాలన్న పట్టుదల భాషా వివాదాలకు దారి తీస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ త్రిభాషా సూత్రాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు ద్విభాషా సూత్రాన్నే అనుసరిస్తోంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. దీని ప్రకారం మాతృ భాషతో పాటు ఇంగ్లీషు కూడా అమలవుతోంది. మూడో భాషగా హిందీ వినియోగించడం ద్వారా దేశంలో భాషా వైవిధ్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అన్న వాదనను తమిళనాడు ముందు నుంచీ అంగీకరించడం లేదు. స్టాలిన్‌ ఈ వివాదానికి ఆర్థిక కోణం కూడా జోడిస్తున్నారు. మేం ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. అంటే ఆర్థికాభివృద్ధి సాధించగలిగితే దేశంలోని వైవిధ్యాన్ని వినియోగించుకోవడానికి హిందీతో పని లేదు అన్నది ఆయన వాదన. హిందీ మాట్లాడే వారే తమ రాష్ట్రాల్లో ఉపాధి దొరకక ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు అనేది స్టాలిన్‌ తర్కం. ఒక రకంగా స్టాలిన్‌ వాదనలో పస ఉంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలలోకి వెళ్లే వారు అక్కడ భాష నేర్చుకోవలసి రావడం సబబేగా! హిందీ నేర్చుకొమ్మని బలవంతపెట్టడంతోనే సమస్య వస్తోంది. కానీ దక్షిణాదికి వచ్చి పని చేసే వారు ఆ రాష్ట్రాల స్థానిక భాషను నేర్చుకోకుండానే ఇంగ్లీషుతో వ్యవహారం నడిపేయగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం హిందీని రుద్దాలని ప్రయత్నించడం అందుకే అర్థ రహితమైంది. దక్షిణాది రాష్ట్రాలు హిందీ మాట్లాడే రాష్ట్రాలకన్నా మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధించాయి. ఉత్తరప్రదేశ్‌ లాంటి చోట హిందీ విస్తృతంగా వాడినా అవధి, భోజ్‌ పురి వాడే వారు ఉన్నారు. హిందీని రుద్దాలన్న ప్రయత్నంలో ఇలాంటి ప్రాంతీయ భాషలను ధ్వంసం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. త్రిభాషా సూత్రం వల్ల వివిధ ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని ఆశించారు. కానీ హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఇది జరగనే లేదు. ఆ రాష్ట్రాలలో మరాఠీ, బెంగాలీ, కన్నడ భాషలను ప్రవేశపెట్టనే లేదుగా! హిందీ వాడడం వల్ల భారతీయతా భావనను పెంపొందింపవచ్చునన్నది వాస్తవం కాదు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు అనుకుంటున్న చోట అనేక ప్రాంతీయ భాషలను హిందీ మింగేస్తోంది. హిందీ గురించి మాట్లాడే వారు తులసీ దాస్‌, సూర్దాస్‌ రచనలను ఎందుకు చదవలేకపోతు న్నారు? తులసీ దాస్‌ రామాయణం వీరు చెప్పే ప్రామాణిక హిందీ భాషలో లేదుగా. భాషాభిమానం తప్పు కాదు. దురభిమాన్ని తిప్పి కొట్టాల్సిందే. త్రిభాషా సూత్రాన్ని నిరాకరించడంవల్ల సమగ్ర శిక్షా అభియాన్‌ కింద ఆ రాష్ట్రానికి అందాల్సిన రూ. 573 కోట్లను కేంద్రం అందకుండా చేసింది. అంటే హిందీని అమలు చేయక పోతే నిధులు నిలిపేస్తారన్నమాట. ఇది భాషాభిమానం పేరిట భాషా విద్వేషాన్ని ప్రోత్సహించడమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు