నెల్లూరులో మొట్టమొదటి గా కార్పొరేట్ పునరావాస కేంద్రం
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు :ఆసుపత్రిలో చేరిన వ్యక్తి వైద్య చికిత్సల అనంతరం రోగి త్వరగా కోలుకునేందుకు వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన పునరావాస కేంద్రం నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఏర్పాటైంది. ఈ పునరావాస కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ ప్రాంగణంలోనే ఈ పునారావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలకు శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డితో కలిసి పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో మొట్టమొదటి సారిగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సౌకర్యాలతో పాటు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కొనసాగే ఈ కేంద్రం… చికిత్స పొందిన రోగులు త్వరగా కోలుకునేందుకు ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. అనంతరం మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి మాట్లాడుతూ నెల్లూరుజిల్లాలో ఇప్పటి వరకూ ఏ హాస్పిటల్ కూడా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. మొట్ట మొదటి సారిగా మెడికవర్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఉందన్నారు. చికిత్స పొందుతున్న వారికి, పొందిన తర్వాత రోగులకు ఈ కేంద్రం సంరక్షణగా ఉంటుందని వారు తెలిపారు. రోగి శారీరక, మానసిక సామర్ధ్యాన్ని తిరిగి పొందేందుకు వంద శాతం ఈ కేంద్రం దోహదపడుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ లాంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి ప్రజలు త్వరగా కోలుకునే విధంగా ఈ పునరావాస కేంద్రంలో అనేక సౌకర్యాలుఅందుబాటులో ఉన్నాయని, స్ట్రోకులు, వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవారికి ఈ కేంద్రం ద్వారా అవి రాకుండా నిరోధించే అవకాశం ఉందని డాక్టర్ ధీరజ్ రెడ్డి, డాక్టర్ బింధు రెడ్డి లు వెల్లడించారు. ఫిజియో థెరపి, స్పీచ్ థెరఫి ఇలాంటి సౌకర్యాలు కూడా ఈ కేంద్రంలో అందుబాటులోఉంటాయన్నారు. ఈ పునరావాస కేంద్రంలో రోగిని 24 గంటలూ పర్యవేక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, నర్సింగ్ హెడ్ శైలజ, మార్కెటింగ్ హెడ్ సతీష్, వైద్యులు, వైద్య సిబ్బంది, పిఆర్వో చందు వర్మ పాల్గొన్నారు.
మెడికవర్ లో పునరావాస కేంద్రం : ప్రారంభించిన ఎస్పీ కృష్ణకాంత్
RELATED ARTICLES