పోసాని కృష్ణమురళి అరెస్టుపై సీపీఐ నేత రామకృష్ణ
పవన్ కల్యాణ్ మీద కోపం ఉంటే ఆయనను విమర్శించాలని సూచన
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం తప్పేమీ కాదని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పవన్ కల్యాణ్ భార్య, పిల్లలను అవమానించేలా పోసాని మాట్లాడారని గుర్తు చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన అలాంటి వారికి ఎవరూ మద్దతు ఇవ్వకూడదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. పోసాని గతంలో చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. పోసాని కేవలం సినిమా నటుడు మాత్రమే కాదని, మాటల రచయిత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి అని తెలిపారు. అలాంటి వ్యక్తి అంతలా దిగజారి నీచంగా మాట్లాడటం సరికాదన్నారు. అలాంటి మాటలు ఏ పార్టీలో ఉన్నవారు చేసినా తప్పే అవుతుందని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ మీద కోపం ఉంటే ఆయనను విమర్శించడంలో తప్పులేదని, కానీ ఆయన భార్యను, పిల్లలను అవమానించేలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దిగజారి మాట్లాడిన పోసానిని, ఆయనలాంటి వ్యక్తులకు ఎవరు అండగా నిలబడ్డా అది పొరపాటు అవుతుందన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పరస్పర విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత విమర్శలు, అందులోనూ మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఆక్షేపనీయమన్నారు.