. నేడు గవర్నర్ ప్రసంగం
. 19 లేదా 20న వార్షిక పద్దు?
. అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్
విశాలాంధ్ర`హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో.. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ నెల 19 లేదా 20న ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. డిలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపైనా సభలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 20 వేల కోట్లు ఉండే అవకాశం ఉంది. దీనిపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.
మద్యం ఆదాయంపై ఆశలు
గతేడాది మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. దాదాపు రూ.40 వేల కోట్ల వరకు ఒక్క మద్యంపైనే ఆదాయం వచ్చింది. ఈసారి అంతకు మించి ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.60 వేల కోట్లు ఆదాయం మద్యం ద్వారా రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆ శాఖ మంత్రి.. ఆదాయమార్గాల పెంపుపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
అసెంబ్లీకి కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. ఈ సారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాబోతున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక.. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. తన ప్రమాణ స్వీకారం రోజున ఒకసారి.. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భగా రెండోసారి మాత్రమే సభకు వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.. అప్పట్లో కేసీఆర్ శాసనసభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విమ ర్శించినా కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అనేక వేదికలపై ప్రస్తావించి బీఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లోని నెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..
అరగంట ముందుగానే…
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిరోజూ అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఎల్పీలో సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించారు. ‘‘హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి సుదీర్ఘంగా వివరించాలి. పదేళ్లలో బీఆర్‌ఎస్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే… కాంగ్రెస్ 14 నెలల్లోనే లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసింది. అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్‌ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండిరగ్స్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కొట్లాడాలి. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రజా సమస్యలు ఎండ గట్టాలి. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలి’’ అని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్‌పై ఫిర్యాదు
కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు సభాపతికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ.. అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌కు వేతనం నిలిపివేయాలని కోరారు. ఇన్ని రోజులు కేసీఆర్‌కు ఇచ్చిన జీతాన్ని రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు.