Wednesday, March 12, 2025
Homeఅంతర్జాతీయంహైజాక్ రైలు నుంచి 100 మందికిపైగా బందీల విడుదల.. 16 మంది రెబల్స్ కాల్చివేత

హైజాక్ రైలు నుంచి 100 మందికిపైగా బందీల విడుదల.. 16 మంది రెబల్స్ కాల్చివేత

ఇరు వర్గాల మధ్య రాత్రి నుంచి కొనసాగుతున్న భీకర పోరు
తాము 30 మంది పాక్ సైనికులను చంపేశామన్న బీఎల్ఏ

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హైజాక్ చేసిన జఫార్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి 100 మందికిపైగా బందీలను సైనిక దళాలు విడిపించాయి. ఈ క్రమంలో 16 మంది రెబల్స్‌ను కాల్చి చంపాయి. మరోవైపు, 30 మంది పాకిస్థాన్ మిలటరీ సిబ్బందిని చంపేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది. దాడి తర్వాత రైలు బోలన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఆగింది. లోపల బందీలుగా ఉన్న వారి పరిస్థితి తెలియరాలేదు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రైలు క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌కు వెళ్తుండగా బీఎల్ఏ మిలిటెంట్లు దాడిచేసి రైలును హైజాక్ చేశారు. ఆ సమయంలో రైలులోని 9 బోగీల్లో దాదాపు 400 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలు ప్రయాణించే మార్గంలో మొత్తం 17 సొరంగాలు ఉండగా, 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం రైలును చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లోకో పైలట్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

భద్రతా బలగాలు ఇప్పటి వరకు 104 మంది ప్రయాణికులను రక్షించాయి. వీరిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. రాత్రి నుంచి బలూచిస్థాన్ రెబల్స్, పాకిస్థాన్ దళాల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. తమవైపు నుంచి ఎలాంటి నష్టం జరగలేదని, 30 మంది సైనికులను చంపేశామని బీఎల్ఏ రెబల్స్ ప్రకటించారు. అయితే, ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించలేదు. బందీల్లో కొందరిని సమీపంలోని పర్వతాల్లోకి తీసుకెళ్లగా, మిగతా వారిని రైలులోనే ఉంచినట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు