. పాఠశాలలు ప్రారంభించేలోపు నియామక ప్రక్రియ పూర్తి
. ప్రతి అధికారి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
. గౌరవభావంతో సంక్షేమ పథకాలు అందించండి
. జిల్లా కలెక్టర్ల తొలిరోజు సమావేశంలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పాఠశాలలు ప్రారంభించేలోపు నియామక ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మెగా డీఎస్సీపై స్పష్టమైన ప్రకటన చేశారు. మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే దస్త్రంపైనే మొదటి సంతకం చేశామని, దానికనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వగానే డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించి పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో ఒకేసారి 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని, దాదాపు 80 శాతం ఉపాధ్యాయులను తమ హయాంలోనే నియమించామని గుర్తు చేశారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి, పునర్నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే దానిని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని సీఎం అన్నారు. జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తున్నాయని అన్నారు. చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరిస్థాయి వరకు చేరాలి. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవభావంతో ఇవ్వాలి. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకెళ్లాలి. మీరు చేసే ప్రతి పనిని మేము సమీక్షిస్తున్నాం. పౌరులకు అందించే 22 సేవల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మా కోసమే పని చేస్తోందన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలని సీఎం కలెక్టర్లను కోరారు.
ఆదాయంతోనే సంక్షేమం సాధ్యం
సంక్షేమం, అభివృద్ధి, స్వపరిపాలన అనే మూల స్తంభాలపైనే సుపరిపాలన ఆధారపడి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరికం పోయి ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాల అమలు తప్పనిసరి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తగినంత ఆదాయం రావాలి. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే స్థిరంగా కొనసాగవు. గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చాలి. వాటికి వడ్డీలు కట్టాలి. మరో పక్క స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాలు పొందుపరిచాం. దీనికి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకూ ప్రణాళికలు వేసుకుని పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కొద్దికాలంలోనే చాలా హామీలు నెరవేర్చాం
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చామని చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు రూ.4 వేలు ఇస్తున్నాం. రూ.200 ఉన్న పింఛన్‌ను 2014లో రూ.2 వేలు చేశాం. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు ఒకేసారి పెంచాం. రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేలు చేశాం.
దాన్ని మళ్లీ ఇప్పుడు రూ.6 వేలకు పెంచాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైనవారికి మానవతా దృక్పథంతో రూ.15 వేలు ఇస్తున్నాం. రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చడానికి 204 అన్నా క్యాంటీన్లు నెలకొల్పాం. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మత్స్యకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపులు 10 శాతం కేటాయించాం. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేశాం. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం. బీసీ, ఎస్సీలకు ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా ఇస్తున్నాం. వీటన్నింటికి మించి పోలవరాన్ని కేంద్ర సహకారంతో గాడినపెట్టాం. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నాం. అమరావతి రాజధాని పనులు కూడా చేపట్టాం. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సాయం తీసుకుంటున్నాం. అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్‌తో పాటు విశాఖ రైల్వే జోన్ సాధించాం. రూ.861 కోట్లతో 20 వేల కి.మీ మేర గుంతలు పూడ్చివేస్తున్నాం. దాదాపు 95 శాతం మేర పనులు పూర్తయ్యాయని సీఎం వివరించారు.
20 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు లక్ష్యం
పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునేవారికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూఫ్ టాప్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థను ప్రక్షాళను చేశాం. రూ.4 వేల కోట్లతో 40 వేల పనులను పల్లె పండుగ కార్యక్రమం కింద ప్రారంభించాం. నీటి నిర్వహణపై దృష్టి పెట్టాం. మే నెలలో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు అందిస్తామని సీఎం వెల్లడిరచారు. జిల్లాల్లో సంపద సృష్టికి ఏం చేయగలుగుతారో కలెక్టర్లు ఆలోచించాలని అన్నారు. జీఎస్డీపీ పెరుగుదల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు తద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపారు. రూ.3.27 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపట్టాం. వచ్చే ఏడాదికి 15 శాతం తగ్గకుండా జీఎస్డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలి. ముఖ్యంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైన దృష్టి పెట్టాలి.
రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సాధించేలా ముందుకు వెళుతున్నాం. పర్యాటకంలో 20 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దు. గంజాయి సరఫరా చేసి, రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపండి. శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్లు జిల్లా ఎస్సీలతో కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు ఉద్బోధించారు.