Friday, April 4, 2025
Homeవివేకా హత్య కేసులో కుట్ర కోణాలు

వివేకా హత్య కేసులో కుట్ర కోణాలు

. సునీత, నర్రెడ్డిని కేసులో ఇరికించే యత్నం
. సీబీఐ అధికారులపైనా కేసు నమోదు
. అవినాశ్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిందే
. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో జరిగిన కుట్ర కోణాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మంగళవారం అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తుకు సంబంధించి విచారణాధికారి నివేదిక ఇచ్చారు. పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను జతచేసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. దీనిలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివేకా హత్య కేసును ఎంపీ అవినాశ్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసేందుకు కుట్ర చేశారని పేర్కొంది. సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కూడా కుట్రకోణంలో భాగంగా ఈ కేసులో ఇరికించాలని చూశారని, సీబీఐ అధికారులపై కేసుల నమోదు కూడా దీనిలో భాగమేనని తెలిపింది. సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు పెట్టినప్పుడు ఉన్న దర్యాప్తు అధికారి జి.రాజు ప్రొఫెషనల్‌గా కేసు విచారించలేదని పేర్కొంది. తనను అవినాశ్‌రెడ్డి బెదిరించినట్లు జి. రాజు అంగీకరించినట్లు అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిరచింది. రిటైర్డ్‌ ఏఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, ఏఎస్‌ఐజి రామకృష్ణారెడ్డిలే ప్రధాన పాత్రధారులని, వారిద్దరే ఈ కేసు మొత్తం నడిపించారని తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, సాక్షులను విచారించినట్లు దొంగ వాంగ్మూలాలు పుట్టించడం, చార్జిషీటు దాఖలు చేయడం… ఇలా ప్రతి ఒక్కటీ రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, ఏఎస్‌ఐజీ రామకృష్ణారెడ్డిలే చేశారని తెలిపింది. ఎంవీ కృష్ణారెడ్డి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కదానికీ సరైన ఆధారాలు చూపలేకపోయారని, ఎంవీ కృష్ణారెడ్డిని రాంసింగ్‌ ఎప్పుడూ విచారించలేదని చెప్పింది. తనను రాంసింగ్‌ హింసించి, థర్డ్‌ డిగ్రీ ఉపయోగించినట్లు, వైఎస్‌ అవినాశ్‌, ఆయన కుటుంబసభ్యులకు వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకున్నారని ఎంవీ కృష్ణారెడ్డి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటీ నిజం లేదని వెల్లడిరచింది. సాక్షులను విచారించకుండానే విచారించినట్లు చార్జిషీటు తయారు చేశారని తెలిపింది. ఏఎస్‌ఐజీ రామకృష్ణారెడ్డి నివాసంలోనే తతంగం అంతా పూర్తి చేశారని, కేవలం 12 రోజుల్లోనే కట్టుకథ అల్లి… రాంసింగ్‌, సునీత, నర్రెడ్డిపై కేసు నమోదు చేశారని వివరించింది. తన ఫిర్యాదుకు మద్దతునిచ్చే ఏ ఒక్క ఆధారాన్నీ ఎంవీ కృష్ణారెడ్డి సమర్పించలేకపోయారని పేర్కొంది. దర్యాప్తు అధికారి జి. రాజు ఎక్కడికీ వెళ్లకుండానే నివేదిక తయారు చేశారని, అదంతా రాజేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి చూసుకున్నారని చెప్పింది. తాము ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని సాక్షులు చాలామంది విచారణలో తెలిపారని వెల్లడిరచింది. కేసు డైరీలోని పత్రాలపై సంతకం చేయడానికి దర్యాప్తు అధికారి నిరాకరించినప్పుడు ఆయనను రామకృష్ణారెడ్డి, రాజేశ్వరరెడ్డి ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని వివరించింది. తమ సూచనలు పాటించకపోతే తీవ్ర పరిణామలు ఉంటాయని జి.రాజును అవినాశ్‌రెడ్డి బెదిరించినట్లు పేర్కొంది. రిటైర్డ్‌ పోలీసు అధికారులతో కుమ్మక్కైన అవినాశ్‌రెడ్డి, తన సహచరులు వివేకా హత్య కేసు నుంచి విముక్తి పొందేందుకు పన్నిన కుట్ర అని స్పష్టంగా అర్థమవుతోందని అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు