Monday, April 7, 2025
Homeతెలంగాణరిజర్వేషన్లు సాధిస్తాం

రిజర్వేషన్లు సాధిస్తాం

. బీసీలను బలపర్చాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకం
. దామాషా ప్రకారం నిధులు… నియామకాలు
. తెలంగాణలో కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చాం
. ‘దిల్లీ’ గర్జనలో సీఎం రేవంత్‌

విశాలాంధ్ర-హైదరాబాద్‌: దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్ర పరిధిలోని అంశమని, తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోదీకి ఉన్న ఇబ్బంది ఏంటని నిలదీశారు. దిల్లీలో బుధవారం జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ స్ఫూర్తితోనే కుల గణన చేపట్టడమే కాకుండా బీసీలకు రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు … స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కొనసాగాలన్నా జనగణనలో కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కుల గణన ఆధారంగా విద్య, ఉద్యోగ, ఉపాధిలో మాత్రమే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు పెంచుతాం అని రాహుల్‌ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. మేం అధికారం చేపట్టిన వంద రోజులు తిరగకముందే బలహీనవర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మానం చేశామని తెలిపారు. ఏడాది తిరగకముందే కులగణన పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఫిబ్రవరి 4న చట్టసభల్లో బిల్లు పెట్టామని చెప్పారు. ఆ రోజును సోషల్‌ జస్టిస్‌ డే గా ప్రకటించామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయమని గల్లీ నుంచి దిల్లీ వరకు యువత పోరాడారని వివరించారు. 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకున్నామని చెప్పారు. రిజర్వేషన్లు పెంచాలనే బలహీన వర్గాల ధర్మబద్దమైన కోరిక నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకురావాలని పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ వ్యతిరేకమని, మొరార్జీ దేశాయ్‌ మండల్‌ కమిషన్‌ నియమిస్తే, వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ దుమ్ము దులిపి ముందుకు తెచ్చారన్నారు. మండల్‌ కమిషన్‌పై బీజేపీ కుట్ర చేసి కమండల్‌ యాత్ర మొదలుపెట్టిందని, ఆ కమండల్‌ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అంటూ ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ అమ్మలా వ్యవహరించి దళిత, ఆదివాసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి ఇళ్లు ఇచ్చిందన్నారు. భూస్వాముల వద్ద వేల ఎకరాలు గుంజుకొని ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిందని చెప్పారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ కులగణన చేయాలని డిమాండ్‌ చేసినా జన గణన చేయకుండా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తామన్నారు. బండి సంజయ్‌ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారని, ఆయన ప్రాణం మాకు వద్దు… వందేళ్లు ఆయన జీవించాలి… మాకు రిజర్వేషన్లు పెంచితే చాలని అన్నారు. న్యాయమైన బీసీ రిజర్వేషన్ల కోసం దిల్లీ వచ్చాం… ఇకపై రామన్నారు. రిజర్వేషన్ల పెంపునకు బలహీన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించాలన్నారు. మోదీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేసి రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు