చిత్తూరు కాల్పుల ఘటనలో భారీ ట్విస్ట్
చిత్తూరులో బుధవారం ఉదయం కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో సినిమాను మించిన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు టౌన్ లోని గాంధీరోడ్డులో ఉదయం ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా ప్రవేశించింది. గాలిలోకి కాల్పులు జరిపి వ్యాపారి కుటుంబ సభ్యులను బెదిరించింది. ఇల్లును దోచుకోవడానికి ప్రయత్నించగా.. వ్యాపారి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వ్యాపారి ఇంటిని చుట్టుముట్టారు. ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించి రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించిన ఈ వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. సదరు వ్యాపారిని దోచుకోవడానికి మరో వ్యాపారే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు బయటపడింది.
గాంధీరోడ్డులోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి బుధవారం ఉదయం ఓ దొంగల ముఠా చొరబడింది. ఇంట్లోకి వచ్చీరావడంతోనే గాలిలోకి కాల్పులు జరిపి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను బెదిరించింది. దోపిడీ ముఠా ఇల్లు దోచుకునే ప్రయత్నంలో ఉండగా చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టి ముఠాలోని ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దొంగల నుంచి తుపాకులు, రబ్బర్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణలో స్థానికంగా నివసించే ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని ఈ దోపిడీకి ప్లాన్ చేశాడని, పథకం ప్రకారం కర్ణాటక ముఠాను రంగంలోకి దించాడని తెలిసిందని పోలీసులు వివరించారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.