విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ ను నియమించాలని మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో పెద్దకడబూరులోని ఆదోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో ప్రజా సమస్యలను, రైతు సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికై ఎంతో మంది తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ ఉంటారని, కానీ తహశీల్దార్ ప్రియదర్శిని ఉదయం 11 గంటలైనా ఆఫీసుకు రాలేకపోవడంతో తహసీల్దార్ కు విధుల పట్ల ఎంతటి గౌరవం ఉందో అర్థమౌతుందన్నారు. రైతులను కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారు గానీ పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అలుసుగా తీసుకొని వీఆర్వోలు కూడా ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియదన్నారు. వీటిని నాయకులు ప్రశ్నిస్తే నాయకులపై తప్పుడు కేసులు పడుతూ, రైతులను బెదరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులపై దయ ఉంచి ఆదోని సబ్ కలెక్టర్ స్పందించి తహసీల్దార్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, షేక్షావలి, వీరేష్, రవి, నాగరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.