జమ్మ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఘటన
ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి
ప్రాణాలు కోల్పోయిన వైనం
తాజాగా వీడియో బయటకు రావడంతో క్లారిటీ
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అయితే, మొదట ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని విమర్శలు వచ్చాయి. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో సదరు వ్యక్తి తనకు తానుగానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమైంది.
ఎత్తైన ప్రదేశం నుంచి తీసిన వీడియోలో 23 ఏళ్ల ఇమితియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తి ఇలా భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకుతున్నట్లు ఉంది. శనివారం మాగ్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సందర్భంగా కుల్గాంలోని టాంగ్మార్గ్లోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకు ఆహారం, లాజిస్టిక్స్ ఇచ్చానని అతను పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
అనంతరం ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా దళాలను తీసుకెళతానని అతడు నమ్మించాడు. దీంతో ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ బలగాలు అతని వెంట వెళ్లాయి. ఈ క్రమంలో ఇమితియాజ్ అహ్మద్ పారిపోయే ప్రయత్నంలో వేషా నదిలోకి దూకాడు. అతను తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఆ వీడియోలో ఆ వ్యక్తి ఈత కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది, కానీ బలమైన ప్రవాహంలో అతను కొట్టుకుపోయి మునిగిపోయాడు.
అయితే, ఈ ఘటన గురించి మొదట తప్పుడు ప్రచారం జరిగింది. ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే మరణం వెనుక కుట్ర ఉందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
కుల్గాంలోని ఒక నది నుంచి మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఇంతియాజ్ మాగ్రేను సైన్యం తీసుకెళ్లిందని, ఇప్పుడు అతని మృతదేహం నదిలో కనిపించిందని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు. ఇది భద్రతా బలగాల తీవ్రమైన దుశ్చర్య అని ముఫ్తీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు వీడియో బయటకు రావడంతో ఈ ఘటనపై క్లారిటీ వచ్చినట్టైంది. భద్రతా బలగాల తప్పులేదని స్పష్టమైంది.