విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కల్లుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి షేక్షావలి డిమాండ్ చేశారు. శనివారం పెద్దకడబూరులో వారు విలేకరులతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి పాఠశాలకు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల చదువులు గాడి తప్పిందన్నారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఉసేనప్పకు హెచ్ ఏం గా ఇంచార్జీ ఇవ్వడంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమయపాలన పాటించకుండా పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారన్నారు. గత సంవత్సరం 24 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తే నలుగురు మాత్రమే ఉత్తీర్ణులైయ్యారని తెలిపారు. దీంతో పాఠశాలలో చదువు ఎంత నాణ్యత ఉందో అర్థమవుతుందన్నారు. కావున మండల విద్యాధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులను తొలగించి రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ఇస్మాయిల్, ఖలీల్, మహ్మద్, మోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.