రైతులకు సాగునీటి కష్టాలు చూసి వెంటనే స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
ఫిబ్రవరి 3 నుండి అదనంగా ఒక టీఎంసీ నీరు విడుదల చేయాలని ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; సాగునీరు లేని కారణంగా పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్న రైతుల కోసం తుంగభద్ర హెచ్ఎల్సీ నుండిపీఏబీఆర్ ద్వారా అదనపు నీటిని తెప్పించి వారి కష్టాలు తీర్చనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి, తాడిమర్రి నార్సింపల్లి చెరువులకు తుంగభద్ర హెచ్ ఎల్ సి నుండి పీఏబీఆర్ కాలువ ద్వారా ఫిబ్రవరి 3 నుండి అదనంగా ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చెరువుల నుండి నీటిని పొందుతున్న బత్తలపల్లి, రాఘవంపల్లి, నార్సింపల్లి, ఏకపాదంపల్లి, పిన్నదరి గ్రామాల రైతులు తమకు కావలసినంత సాగునీరు అందకపోవడంతో తాము సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యపై వెంటనే స్పందిస్తూ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఈఎన్సీ, సత్య సాయి, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, సాగునీటిశాఖ ఎస్ఈలతో మాట్లాడి వెంటనే తుంగభద్ర హెచ్ఎల్సీ నుండి పిఏబిఆర్ కాల్వ ద్వారా ఈ చెరువులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఫిబ్రవరి 3 నుండి ఈ చెరువులకు అదనంగా ఒక టీఎంసీ సాగునీరు విడుదల చేయనుండడంతో ఇన్నేళ్లుగా పంటలు ఎండిపోయి కష్టాలు పడుతున్న ఈ గ్రామాల రైతులకు సాగునీటి కష్టాలు తీరునున్నాయి.