విశాలాంధ్ర-అనంతపురం : జంతలూరులోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో క్లౌడ్ ఆధారిత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ మరియు బిజినెస్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్‌లో గ్లోబల్ లీడర్ అయిన ఏ డి పి కంపెనీ కోసం రెండురోజుల ప్రాంగణ నియామక శిబిరం విజయవంతంగా నిర్వహించినట్లుఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం నుండి 34 మంది, అనంతపురం మరియు చుట్టుపక్కల ఇతర సంస్థల నుండి 112 మంది, మొత్తంగా 146 మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొన్నారు. వీరిలో 52 మంది విద్యార్థులు ఆన్‌లైన్ మూల్యాంకనంలో ప్రతిభ కనబరచగా, 32 మంది వాయిస్ మరియు యాక్సెంట్ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులయ్యారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి అభిషేక్ మణి త్రిపాఠి, అల్మాస్ ఫాత్మా, క్రిష్ సూద్, చదువుల సృజన, రిమి కుమారిలు, సంభవ్ ఫౌండేషన్ నుండి పి. తస్లీమ్ ఏ డి పి కి ఎంపికయ్యారన్నారు.
ఎంపిక విధానం రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్, వాయిస్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలతోపాటు చివరిగా హెచ్ ఆర్ ఇంటర్వ్యూ వంటి వివిధ దశలలో జరిగిందన్నారు. వారి కృషి పట్ల ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి, అకడమిక్ డీన్ ఆచార్య సి. షీలారెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఆచార్య జి. రామ్ రెడ్డి, ప్లేస్‌మెంట్ సెల్ సభ్యులు, ఏ డి పి ప్యానెల్ సభ్యులు అభినందించారు.