4.2 తీవ్రతతో సంభవించిన మరో భూకంపం
తొలి భూకంప కేంద్రాన్ని మాండలే సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున గుర్తింపు
మయన్మార్‌ను తాజాగా మరో భూకంపం భయపెట్టింది. శుక్రవారం పొద్దుపోయాక సంభవించిన ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. అంతకుముందు 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఆగ్నేయాసియాను కుదిపేసింది. దీని కారణంగా ఇప్పటి వరకు 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మయన్మార్, థాయిలాండ్‌లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్యాంకాక్‌లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 9 మంది గాయపడ్డారు. భూకంపం ధాటికి నిర్మాణంలో ఉన్న హైరైజ్ భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికిపైగా గల్లంతయ్యారు. తొలి భూకంపం ధాటికి మయన్మార్‌లో 144 మంది చనిపోగా 732 మంది గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య 1000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజధాని నేపీటాలో 96 మంది, సాగెయింగ్‌లో 18 మంది, క్యుక్సేలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఒక్క మయన్మార్‌లోనే 694 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, గాయపడిన వారిలో 432 మంది రాజధానికి చెందినవారు కాగా, సాగెయింగ్‌లో 300 మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ సమాజం తమకు సాయం అందించాలని మయన్మార్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ కోరారు.
మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రాన్ని మయన్మార్‌లో రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున గుర్తించారు. ఆ తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రాజధాని నేపిటాలో పలు భవనాలు ధ్వంసమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంప ప్రకంపనలు థాయిలాండ్‌ను కూడా భయపెట్టాయి. దీంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రకంపనల నేపథ్యంలో బ్యాంకాక్‌లో మెట్రో, ఇతర రైలు సర్వీసులను నిలిపివేశారు. అలాగే, చైనా నైరుతి ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్‌ను కూడా ప్రకంపనలు తాకాయి. 7.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు బీజింగ్‌లోని భూకంప ఏజెన్సీ తెలిపింది. కాగా, మయన్మార్‌లో భూకంపాలు సర్వసాధారణం. 1930- 1956 మధ్య 7, అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు భారీ భూకంపాలు సంభవించాయి.