ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ప్రభుత్వ నిర్ణయం
విద్యార్థులు 9552300009 నంబర్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రైవేటు విద్యాసంస్థలు సకాలంలో ఫీజు చెల్లించని విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేసేవి. ఇప్పుడు అలాంటి కష్టాలు విద్యార్థులకు ఉండవు. ఇకపై ఇంటర్ హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థులు నిరభ్యంతరంగా ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు 9552300009 నంబర్ ద్వారా నేరుగా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇలా వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం త్వరలో పదవ తరగతికి కూడా కల్పించనున్నారు. ఇక వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే.
వాట్సప్ ద్వారా ఇంటర్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
మొదట ఫోన్‌లో వాట్సప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోవాలి
తర్వాత సెర్చ్ బాక్స్‌లో ఇంటర్ హాల్‌టికెట్ లేదా హాయ్ అని టైప్ చేయాలి
మీకు మనమిత్ర వాట్సప్ గర్ననెన్స్ నుంచి రిప్లయ్ వస్తుంది
ఆ మెసేజ్‌లో కింద సర్వీసును ఎంచుకునే ఆప్షన్ వస్తుంది
అనంతరం ఆ సర్వీసులలో ఒకదానిని ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది
అక్కడ క్లిక్ చేసి విద్య సేవలు అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
అనంతరం సెలక్ట్ హాల్‌టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది
అందుబాటులో ఉన్న హాల్‌టికెట్ల గ్రీన్ సింబల్ కనిపిస్తుంది
మీకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి
అనంతరం రోల్ నంబర్, ఫస్టియర్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేది వంటి వివరాలు ఎంటర్ చేయాలి
మీ హాల్‌టికెట్ డిస్‌ప్లే అవుతుంది.. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఇప్పటికే ప్రాక్టికల్స్, వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇది రెండు సెషన్లలో జరుగుతుంది. ఒకేషనల్ ఇంటర్ వారికి 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.
ఇక వార్షిక పరీక్షలలో భాగంగా మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగుతాయి. అలాగే మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.