అమెజాన్ అటవీ ప్రాంతంలో సమిట్ కోసం బ్రెజిల్ ఏర్పాట్లు
సదస్సు ఉద్దేశానికి విరుద్ధంగా ప్రవర్తించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఉద్దేశించిన సదస్సు కోసం బ్రెజిల్ పచ్చటి చెట్లను నరికిస్తోంది.. పచ్చదనం పెంచుకోవాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పే సదస్సు కోసం ఏర్పాట్లు చేస్తూ అదే పచ్చదనాన్ని తొలగిస్తోంది. విరివిగా మొక్కలు నాటాలని ప్రపంచానికి సందేశం ఇచ్చే సదస్సు కోసం ఇలా అడవులను నాశనం చేస్తూ ఏం చెప్పాలనుకుంటోందని బ్రెజిల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ అడవులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.. వాతావరణంలోని కర్బన ఉద్గారాలను గ్రహించి భూమి వేడెక్కకుండా చూడటంలో, జీవవైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో కీలకమైన అమెజాన్ అడవులను ధ్వంసం చేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 30న బ్రెజిల్ లో క్లైమేట్ సమిట్ జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 50 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని అధికారుల అంచనా. భూమి మీద నానాటికీ పెరిగిపోతున్న ఉద్గారాలు, కాలుష్యంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని ఉద్దేశం. ఈ సదస్సు నిర్వహణ కోసం బ్రెజిల్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రతినిధుల బస, రాకపోకలు, సమిట్ వేదిక కోసం అమెజాన్ అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం.. అక్కడ ప్రతినిధుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగా ప్రతినిధుల రాకపోకలు సాఫీగా సాగేందుకు, ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి కొత్తగా ఓ రోడ్డును నిర్మిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. రోడ్డు నిర్మాణం కోసం వందలాది పచ్చని చెట్లను నేలమట్టం చేయడంపై ఇంటా బయటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త రోడ్లు తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్ తీరు వాతావరణ సదస్సు అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని మండిపడుతున్నారు. ాపర్యావరణ సదస్సును అమెజాన్ అడవుల్లో నిర్వహిస్తున్నాం నిజమే. కానీ, అమెజాన్ అడవుల కోసం కాదు కదా్ణ్ణ అంటూ ఆ దేశ అధ్యక్షుడు సమర్థించుకున్నారు.