అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికాతో వాణిజ్య చర్చలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిపివేశారు. చివరి దశ చర్చల్లో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అన్యాయంగా, ఆర్థికంగా నష్టదాయకంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కెనడా నుంచి వచ్చే సుమారు 2,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించేందుకు అమెరికా సిద్ధమైంది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. కెనడాకు ఇతర ప్రధాన ఎగుమతి దేశాల కంటే మెరుగైన వాణిజ్య సదుపాయాలు కల్పించేందుకు అమెరికా ముందుకొచ్చిందన్నారు. అయితే కెనడా చివరి నిమిషంలో కొత్త డిమాండ్లు చేయడంతో పాటు గతంలో ఇచ్చిన కొన్ని హామీల నుంచి వెనక్కి తగ్గిందని ఆరోపించారు.
కెనడా ప్రధాని కార్నీ మాత్రం అమెరికా చివరి నిమిషంలో మార్చిన నిబంధనలు న్యాయబద్ధంగా లేవని అన్నారు. వాటితో ఆర్థికంగా నష్టమేనని పేర్కొన్నారు. కెనడా కార్మికులు, వ్యాపారాలకు అదనపు మద్దతు ప్రకటించనున్నట్లు తెలిపారు.
అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్లు కెనడా నుంచి అమెరికాకు ఏటా వెళ్లే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 5 శాతాన్ని ప్రభావితం చేయనున్నాయి. హాకీ స్టిక్స్ నుంచి వైద్య పరికరాల వరకు పలు ఉత్పత్తులపై ఈ ప్రభావం పడనుంది.
చర్చలు కొనసాగేందుకు ట్రంప్ టారిఫ్ గడువును మూడు రోజులు పొడిగించినా ఒప్పందం కుదరలేదు. గత ఏడాది అమెరికా-కెనడా మధ్య వస్తువులు, సేవల వాణిజ్యం 880 బిలియన్ డాలర్లకు చేరింది. కెనడా ఎగుమతుల్లో దాదాపు 72 శాతం అమెరికాకే వెళ్తున్నాయి.
దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ సన్నిహిత మిత్రదేశాలుగా కొనసాగాయి. అయితే కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తాజాగా టారిఫ్ల పెంపు రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీశాయి.


