భక్తులకు తమ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని స్పష్టీకరణ
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు సంబంధించి భక్తులకు కీలక అప్డేట్ అందింది. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా తెరదించారు. ఛార్ ధామ్ యాత్ర సజావుగా సాగుతోందని చార్ధామ్ యాత్ర ఎటువంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని, యాత్రికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ యాత్రా సీజన్లో ఇప్పటివరకు 4 లక్షలకు పైగా భక్తులు చార్‌ధామ్‌లను విజయవంతంగా దర్శించుకున్నారని సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. యాత్ర సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, శ్రీ కేదార్నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ సేవలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని, ఇవి నిరంతరాయంగా నడుస్తున్నాయని తెలిపారు.
యాత్రకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని ముఖ్యమంత్రి భక్తులకు విజ్ఞప్తి చేశారు. యాత్రికుల ప్రయాణ అనుభవాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. భక్తుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని ధామి అన్నారు.
యాత్రకు సంబంధించిన ఏదైనా సమాచారం లేదా సహాయం అవసరమైతే, భక్తులు 1364 లేదా 0135-1364 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచించారు. ప్రభుత్వం అందించే అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని ఆయన కోరారు.