విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యువరాజ్ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ ఎస్సీలో ఉన్న 59 ఉప కులాలను ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని చేస్తూ ఉన్నారని తెలిపారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ అమలుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఏకసభ్య కమీషన్ ను నియమించిందన్నారు. నేడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాదిగల కల సాకారం అవుతుందని గుర్తు చేశారు. నారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉండడమే కాకుండా డప్పు కొట్టి నేను పెద్ద మాదిగ నవ్వుతా అని చెప్పి 2000 – 2004 వరకు మొదటి దశగా నాలుగేళ్లు వర్గీకరణ అమలు చేశారన్నారు. కానీ గత ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. మరలా రెండవ సారి వర్గీకరణ అమలు దిశగా పయనించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ ద్వారానే 59 ఉప కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబుకు మాదిగలు, ఇతర ఎస్సీ ఉప కులాలు రుణపడి ఉంటారని ఆయన వెల్లడించారు.