చైనాలో వేలాదిగా బయటపడుతున్న వైరస్ కేసులు
జపాన్ కూ వ్యాపించిన హెచ్ఎంపీవీ.. భారత్ లో రెండు కేసులు నమోదు
3 నెలల పాప, 8 నెలల బాబుకు వైరస్ నిర్ధారణ
చైనాలో బయటపడ్డ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్ లోకి ప్రవేశించింది. బెంగళూరుకు చెందిన మూడు నెలల పాపతో పాటు మరో ఎనిమిది నెలల బాబుకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో బయటపడింది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిర్వహించిన వైద్య పరీక్షలో వైరస్ పాజిటివ్ గా తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు చైనా, జపాన్ లకే పరిమితమైన ఈ కొత్త వైరస్ బెంగళూరు చిన్నారులకు సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వారికి ఈ వైరస్ ఎలా సోకిందనే వివరాలు ఇంకా తెలియరాలేదని, వైరస్ స్ట్రైయిన్ వైద్య నిపుణులకు అంతుబట్టడంలేదని కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ తరహాలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా పదకొండు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులలోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఇటీవల ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. పలుచోట్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. హెచ్ఎంపీవీ వైరస్ జపాన్ కూ వ్యాపించింది.