2015లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో బుధవారం.. చోడవరం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన యువకుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఏడేళ్ల బాలికను నిందితుడు బీరు సీసాతో గొంతు కోసి హత్య చేయడం.. అప్పట్లో తీవ్ర సంచలంగా మారింది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతుండగా.. చివరికి చోడవరం కోర్టు తుది తీర్పుని వెల్లడించింది. అయితే చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి మరణశిక్ష విధిస్తూ తీర్పును ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.7 ఏళ్ల చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో నిందితుడు శేఖర్‌ను.. బుధవారం చోడవరం న్యాయమూర్తి దోషిగా ప్రకటించారు. ఈ దారుణానికి ఒడిగట్టినందుకు అతడికి మరణశిక్ష అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చోడవరం కోర్టు చరిత్రలో మొదటిసారి ముద్దాయికి ఉరిశిక్ష విధించినట్లు అయింది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన 31 ఏళ్ల యువకుడు శేఖర్‌కు మరణశిక్ష విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ తీర్పును వెలువరించారు. 2015లో 7 ఏళ్ల బాలికను బీరు సీసాతో అత్యంత కిరాతకంగా గొంతుకోసి శేఖర్ హత్య చేశాడు. 10 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ నేటితో పూర్తి కావడంతో శేఖర్‌పై మోపిన నేరం రుజువు కావడంతో జడ్జి అతనికి మరణ శిక్ష విధించారు.
అయితే వేపాడు దివ్య కుటుంబంతో శేఖర్‌కు గొడవలు ఉండేవి. అవి మనసులో పెట్టుకున్న నిందితుడు శేఖర్.. వేపాడు దివ్య స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. అక్కడి నుంచి.. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు ఆ బాలికను తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను మాటల్లో పెట్టి.. అక్కడే ఉన్న బీర్ బాటిల్‌తో ఆమె గొంతును అత్యంత దారుణంగా కోసి హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా తెలంగాణలోనూ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై వేపాడు దివ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఈ ఘాతుకానికి పాల్పడింది శేఖర్ అని నిర్ధారించుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి.. సుదీర్ఘంగా విచారణ జరిపారు. శేఖర్‌పై పోలీసులు మోపిన అభియోగాలు రుజువు కావడంతో ఇవాళ చోడవరం న్యాయస్థానం శేఖర్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగిందని ఈ తీర్పు విన్న వారు పేర్కొంటున్నారు.