జులై 1 నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన
నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీతో పర్యటన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జులై 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆయా జిల్లాల్లోనే బస చేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పింఛన్ల పంపిణీతో మొదలు..
జులై 1వ తేదీన తన పర్యటనను సంక్షేమ కార్యక్రమంతో ప్రారంభించనున్నారు. ఃపేదల సేవలోః కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అదే రోజు తిరుపతి జిల్లా శ్రీ సిటీకి చేరుకుంటారు. అక్కడ ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతిలోనే బస చేస్తారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
జులై 2వ తేదీన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఁవికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ఁ (Vదీ G =Aవీ G) ను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగే జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌కు హాజరవుతారు. ఈ కీలక సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా పాల్గొననున్నారు. రెండో రోజు రాత్రి కూడా సీఎం తిరుపతిలోనే బస చేస్తారు.
పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా జులై 3వ తేదీన కడప జిల్లా పర్యటన ఉండనుంది. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన స్టీల్ ప్లాంట్ పనులకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను లాంఛనంగా ప్రారంభించి, ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయనున్నారు.
సొంత నియోజకవర్గంలో మూడు రోజులు
స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించిన అనంతరం, చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు బయలుదేరి వెళతారు. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమై, స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. మూడు రోజుల కుప్పం పర్యటన ముగించుకుని జులై 5వ తేదీన తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఈ ఐదు రోజుల పర్యటన ద్వారా ఒకేసారి సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.


