విశాలాంధ్ర ధర్మవరం;; ఎండాకాలం గత రెండు నెలలుగా తీవ్రం కావడంతో పట్టణంలోని 40 వార్డులలో కొన్నిచోట్ల నీటి కొరత తీవ్రంగా ఉంది. ఇందులో భాగంగా కేతిరెడ్డి కాలనీ ఎల్ ఫోర్ విభాగంలో దాదాపు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండు నెలలుగా తాగునీరు, కొళాయి నీరు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుదకు ఎండ వేడిమిని కూడా లెక్కచేయకుండా ధర్మవరం-చెన్నై కొత్తపల్లి ప్రధాన రహదారిలో మహిళలు వందల సంఖ్యలో రెండు గంటలసేపు ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించడంతో వాహనాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ధర్నా నిర్వహిస్తున్న మహిళలతో ఎంత నచ్చజెప్పిన వారు వినకపోవడంతో ధర్నాను ఉధృతం చేశారు. చివరకు సమస్య పరిష్కారం కొరకు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు, డి ఈ వీరేష్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ధర్నా చోటుకు చేరుకున్నారు. అనంతరం వారు అధికారులతో నీటి విషయం చెప్పినా కూడా.. ఎందుకు పట్టించుకోవడంలేదని, తాము పేదవాళ్లం కాబట్టే పట్టించుకోలేదన్న వాదనలు చెలరేగాయి. కనీసం ట్రాక్టర్ ద్వారా రెండు నెలలుగా అరకొరగా నీరును పంపిణీ చేయడం ఎలాగా అని వారు అధికారులను నిలదీశారు. మొత్తం మీద బాధితులతో అధికారులు నచ్చజెప్పి సమస్యను పరిష్కరించే విధంగా తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను మహిళలు విరమించారు.
నీటి కోసం రోడ్డున ధర్నా నిర్వహించిన కాలనీవాసులు
RELATED ARTICLES