ఏపీ సీఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ
విశాలాంధ్ర -అనంతపురం : ఇటీవల సంభవించిన అకాల వర్షాలు, ఈదురుగాలుల వలన అనంతపురం, కడప జిల్లాలలో ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు . సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ… ముఖ్యంగా కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం; అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గలలో అప్పులు చేసి సాగుచేసి, చేతికొచ్చిన ఉద్యానవన పంటలను అకాలవర్షాల వల్ల రైతులు కోల్పోయి విలపిస్తున్నారు అని పేర్కొన్నారు. యల్లనూరు మండలంలోని నీర్జాంపల్లికి చెందిన రైతులు లక్ష్మీనారాయణ, చిన్నవెంగప్ప అరటి సాగు చేశారన్నారు . 18 లక్షలు పెట్టుబడిపెట్టి లక్ష్మీనారాయణ 12 ఎకరాల్లో, 13 లక్షలు పెట్టుబడిపెట్టి చిన్నవెంగప్ప 9 ఎకరాల్లో సాగు చేశారన్నారు . పంట నేలరాలడంతో దిగులుచెందిన వారు ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నేను, మా పార్టీ ప్రతినిధి బృందం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగిందన్నారు. నష్టపోయిన పంటలను వెంటనే అంచనా వేయించి, తక్షణమే నష్టపరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకొని రైతుల్లో భరోసా కల్పించాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరారు.