ఈ సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని… వామపక్ష నాయకుల పిలుపు
విశాలాంధ్ర- అనంతపురం : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విధి విధానాలను నిరసిస్తూ ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సిపిఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం వామపక్ష నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ. నల్లప్ప, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు నాగరాజు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గొప్పల బడ్జెట్ అని పేర్కొన్నారు. 12 లక్షల ఆదాయం ఉన్నవారికి టాక్స్ వెసులుబాటు ఇస్తున్నామంటూ చెప్పడం కేంద్రానికి ఒక ఓటు బ్యాంకుగా పనికొచ్చిందన్నారు. ఈనెల 14 నుంచి వారం రోజులపాటు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలో, గ్రామీణ, పట్టణాలలో సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ వ్యతిరేక విధానాలపై నిర్వహిస్తున్న సదస్సులో వ్యవసాయ, కార్మిక, పారిశ్రామిక, వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ… పేదలను నిర్మూలించే బడ్జెట్ అని అనేక గణంకాలు తెలియజేస్తున్నాయి అన్నారు. నిర్మల సీతారామన్ ఎనిమిదో సారి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ లో ఎక్కువ శాతం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు ఉన్నట్లు స్పష్టంగా బడ్జెట్లో కనబడుతోంది అన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా బడ్జెట్లో కనబడుతోంది అన్నారు. వ్యవసాయ రంగంలో ఇచ్చేటువంటి సబ్సిడీలు, అసలు బీమా పథకాన్ని బడ్జెట్లో పెట్టకపోవడం జరిగిందన్నారు. ప్రాంతాల్లో వలసలు పోకుండా నివారించడానికి బడ్జెట్లో పెంచాల్సింది పోయి తగ్గించే ప్రయత్నం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ… కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆదాని అంబానీ అగర్వాల్ కు ఉపయోగపడుతుందే తప్ప పేద రైతాంగానికి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్మిక, రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడేసిందన్నారు. కార్పొరేట్ రంగానికి వారు చేసిన అప్పులను ఎత్తివేసింది కానీ వ్యవసాయ రంగంలో రైతుల చేసిన అప్పులు ఎత్తివేయకపోవడానికి చూస్తుంటే ఇది కేవలం కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని తెలుస్తోందన్నారు. 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నా బడ్జెట్ వ్యతిరేక విధానాల సదస్సుకు సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు లింగమయ్య, కేశవరెడ్డి,నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి అలిపిర, సిపిఎం నాయకులు బాల రంగయ్య, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.