దేశంలో పెను సంచలనం రేపిన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి నేడు జీవిత ఖైదు పడింది. ఈ కేసులో ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కోల్‌కతాలోని సీల్దా కోర్టు.. శనివారం సంజయ్ రాయ్ దోషి అని తేల్చింది. ఈ కేసులో సోమవారం తీర్పును వెలువరిస్తామని చెప్పిన కోర్టు.. తాజాగా అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇక సంజయ్ రాయ్‌కి ఏం శిక్ష విధిస్తారని దేశం మొత్తం తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. అతడికి జీవిత ఖైదు విధించారు. అయితే ఇంత దారుణంగా హత్యాచారం చేసిన సంజయ్ రాయ్‌కి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ కేసులో తీర్పు వెలువరించేముందు సీల్దా కోర్టు జడ్జి జస్టిస్ అనిర్బన్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ కేసు అరుదైనది అని తాను భావించడం లేదని.. అందుకే చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాలని తీర్పును ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులకు రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.2023 ఆగస్ట్ 9వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ సెమినార్ రూమ్‌లో నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, ఆపై హత్య జరగడం దేశం మొత్తం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట కోల్‌కతా పోలీసులు ఈ కేసు విచారణ ప్రారంభించగా.. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే అందులో చేర్చింది. అయితే ఈ ఘటనలో సామూహిక అత్యాచారం విషయాన్ని ఛార్జిషీట్‌లో పేర్కొనలేదు. ఆర్జీకర్ మెడికల్ ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్‌ని గతేడాది ఆగస్ట్ 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇంఛార్జ్ అభిజిత్ మండల్‌లకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ ఘటనలో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా.. అరెస్ట్ తర్వాత 90 రోజుల్లో పోలీసులు, సీబీఐ ఛార్జ్‌షీట్ ఫైల్ చేయకపోవడంతో వారికి బెయిల్ వచ్చింది.
ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ కుమార్ కు జీవితఖైదు
RELATED ARTICLES