Homeజిల్లాలుఅనంతపురంనార్పల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందా?

నార్పల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందా?

- Advertisement -

రైతుల ఆవేదనకు సమాధానం చెప్పేది ఎవరు సారు?..

విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా, రైతులు అవమానాలు భరించే కేంద్రంగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ పనుల కోసం ఆశతో కార్యాలయానికి వచ్చే రైతులు చివరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విసిగి పోయి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి నెలకొంది.మండలానికి ఇంచార్జి తహసిల్దార్‌గా ఉన్న శ్రీధర్ మూర్తి నార్పల ప్రజలకు పూర్తిగా అందని ద్రాక్షగా మారిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎక్కువ సమయం బుక్కరాయసముద్రం మండలానికే కేటాయిస్తూ, నార్పల కార్యాలయానికి కేవలం హాజరు నమోదు చేసినట్టుగా వచ్చి వెళ్లిపోతున్నారనే విమర్శలు రైతుల నుంచే కాదు… సాధారణ ప్రజల నుంచీ వ్యక్తమవుతున్నాయి.
“తహసిల్దార్ వస్తాడో రాడో తెలియదు వచ్చినా ప్రజల సమస్యలు వినే పరిస్థితి లేదు… కార్యాలయంలో అడిగితే ఒక్కరు సరైన సమాధానం చెప్పరు… ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక అనాథాశ్రమమా?” అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కార్యాలయంలో కొంతమంది సిబ్బంది కూడా తహసిల్దార్ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పనుల కోసం వచ్చే ప్రజలను గంటల తరబడి కూర్చోబెట్టి చివరకు “రేపు రండి… అధికారి లేరు” అంటూ పంపించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పట్టాదార్ పాస్‌బుక్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, భూమి మార్పిడి, వారసత్వ నమోదు వంటి అత్యవసర పనులు నెలల తరబడి పెండింగ్‌లో పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు సమస్యలపై స్పందించాల్సిన రెవెన్యూ శాఖే రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతుండటం బాధాకరమని ప్రజలు అంటున్నారు.
ప్రజల పన్నుల డబ్బులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోతే అలాంటి పరిపాలన వల్ల ఉపయోగమేంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నార్పల మండలంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని, వెంటనే శాశ్వత తహసిల్దార్‌ను నియమించకపోతే ఆందోళనలకు దిగాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్పందించి నార్పల ప్రజల కష్టాలను గుర్తించి పూర్తి స్థాయి తహసిల్దార్‌ను నియమించి కార్యాలయ పరిపాలనను గాడిలో పెట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు