ఆంధ్రప్రదేశ్ స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయనున్న నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అభ్యర్థనకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. మరో వారం, పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో మంత్రి దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి కాట వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు మంత్రి కందుల దుర్గేశ్ కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ప్రధానంగా విశాఖపట్టణం జిల్లా సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయని, కాకినాడ జిల్లా అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నిరోజులు పనులు నిలిచిపోనున్నాయని ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ వివరించారు. స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు- లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే బిడ్ వేశామన్నారు. శాస్కి స్కీమ్ క్రింద చేపడుతోన్న గండికోట ఫోర్ట్‌కు సంబంధించిన టెండర్లు ఇప్పటికే స్వీకరించామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, త్వరలోనే పట్టాలెక్కుతుందని వెల్లడించారు. అందులో భాగంగా పుష్కర్ ఘాట్, హేవలాక్ వంతెనల ఆధునికీకరణ చేపట్టనున్నామన్నారు. ప్రసాద్ స్కీం క్రింద సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని తెలుపుతూ ఇప్పటికే మంజూరైన రూ. 54.04 కోట్ల నిధుల్లో తొలి విడతగా రూ.13.69 కోట్లు వినియోగించామని, మిగిలిన 2,3వ విడత నిధులు త్వరతగతిన మంజూరు చేస్తే మరో 5 నెలల్లో పనులు పూర్తవుతాయని కేంద్ర మంత్రికి మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించామని, వాటిని కూడా పరిశీలించి ఆమోదించాలని మంత్రి కోరారు. అదే విధంగా మంగళగిరి, అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదలను కూడా వీలైనంత త్వరగా ఆమోదిస్తే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రి తెలిపారు.
త్వరలోనే నాగార్జున సాగర్, అహోబిలం, సూర్య లంకలో అభివృద్ధి పనులు షురూ: మంత్రి కందుల దుర్గేశ్
RELATED ARTICLES