భోపాల్ లో వేలాది మంది ప్రాణం తీసిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 ఏళ్లు.. అప్పట్లో లీకైన విష వాయువుకు సంబంధించిన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తొలుత ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ చేసిన సుమారు 377 టన్నుల వ్యర్థాలను పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించి, ఇంజనీరింగ్ నిపుణులతో వాటిని మండించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి విషపూరిత రసాయన వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్లలో లోడ్ చేశారు. వంద మంది కార్మికులు షిప్టుల వారీగా (అరగంట చొప్పున) పనిచేశారు. పని పూర్తయ్యాక కార్మికులకు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కంటైనర్ ట్రక్కులు అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని పిథంపూర్ కు బయలుదేరాయి. ట్రక్కులు జాగ్రత్తగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ వ్యర్థాలను రామ్‌కీ ఎన్విరో ఇంజినీరింగ్ కళాశాల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం చేయనున్నారు. ఇందుకు 153 రోజులు పడుతుందని అధికారుల అంచనా.
కాగా, 1984 డిసెంబరు 2 అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ప్రమాదకర మీథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) గ్యాస్ లీక్ అయింది. ఈ విషవాయువు గాలిలో కలిసి ఫ్యాక్టరీ పరిసరాలతో పాటు భోపాల్ సిటీలో వ్యాపించింది. విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ కార్మికులతో పాటు భోపాల్ లో మొత్తం 3,800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడి ప్రజలపై ఈ విషవాయువు దుష్ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. చాలామంది వైకల్యంతో బాధపడుతున్నారు.