మండుటెండలో విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు
విద్యాశాఖ ఆదేశాలు పాటించని పలు ప్రవేట్ పాఠశాలలు
విశాలాంధ్ర- అమనగల్లు: విద్యాశాఖ ఆదేశాలను ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వము ఈనెల 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఒంటి పుట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. కానీ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పలు ప్రైవేట్ పాఠశాలలు ఆ నియమాలను పాటించకుండా, మండుటెండలో విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒంటిపూట బడులు నిర్వహించకుండా మధ్యాహ్నవేళ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు అంటూ, రోజు వారి మాదిరిగానే పాఠశాలను కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉపాధ్యాయుల మాట కాదనలేక, మండుటెండలో బడులకు వెళ్లాల్సి వస్తుంది. మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో పట్టణ ప్రజలు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రభుత్వ నియమాలు పాటించకుండా వ్యవహారిస్తున్న ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.