Homeజాతీయంసీబీఎస్‌ఈ ఫలితాలపై సందేహాలు.. ప్రతి నలుగురిలో ఒకరి నుంచి వినతి

సీబీఎస్‌ఈ ఫలితాలపై సందేహాలు.. ప్రతి నలుగురిలో ఒకరి నుంచి వినతి

- Advertisement -

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పద్ధతి కారణంగా తమకు అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో లోపాలు చోటుచేసుకున్నాయని, కొన్ని సమాధాన పత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో జవాబు పత్రాల స్కానింగ్‌ ప్రతుల కోసం విద్యార్థుల నుంచి భారీగా అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షలు రాసిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జవాబు పత్రాల ప్రతులను కోరినట్లు సమాచారం.

మొత్తం 11,31,961 జవాబు పత్రాల కోసం అభ్యర్థనలు
ఈసారి సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు సుమారు 17 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
వీరిలో ఇప్పటికే 4,04,319 మంది విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కానింగ్‌ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. మొత్తం 11,31,961 జవాబు పత్రాల కోసం అభ్యర్థనలు వచ్చినట్లు తెలిపింది. అందులో 8,98,214 జవాబు పత్రాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. మిగిలిన ప్రతులను బుధవారం సాయంత్రం నాటికి విడుదల చేస్తామని వెల్లడించింది.
అలాగే మార్కుల నిర్ధారణ, పునర్మూల్యాంకనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తు వేదిక మే 29 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.

ఏంటీ ఓఎస్‌ఎం వివాదం..?
మే 13న సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే మూడు శాతం తగ్గింది. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానం వల్లే తక్కువ మార్కులు వచ్చాయని పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్‌ కాపీలు అందజేస్తామని ప్రకటించింది. వాటిని పరిశీలించిన తర్వాత అవసరమైతే పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

అయితే స్కానింగ్‌ కాపీలు చూసిన తర్వాత మరిన్ని ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి.
దిల్లీకి చెందిన వేదాంత్‌ అనే విద్యార్థి తన భౌతికశాస్త్ర జవాబు పత్రం బోర్డు అప్‌లోడ్‌ చేసిన పత్రంతో సరిపోలడం లేదని ఆరోపించాడు. మరో విద్యార్థిని సంజన కూడా తన రసాయనశాస్త్ర జవాబు పత్రం తారుమారైందని ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై స్పందించిన సీబీఎస్‌ఈ బోర్డు సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు