Homeజిల్లాలుశ్రీ సత్యసాయికరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి

- Advertisement -

26న విజయవాడలో అఖిలపక్ష సభ

కూటమి ప్రభుత్వ విలాస ఖర్చులపై ధ్వజం

విశాలాంధ్ర–పుట్టపర్తి: రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున వెంటనే కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. గురువారం పుట్టపర్తి పట్టణంలోని సాయిఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, గతంలో రాయలసీమకే పరిమితమైన కరువు ప్రస్తుతం కోస్తా, డెల్టా ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో పశువులకు గడ్డి కూడా లభించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. క్షేత్రస్థాయిలో సుమారు 50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతోందని పేర్కొన్నారు. గత నాలుగు నెలల్లోనే 25 కిలోల బస్తా ధర రూ.400 నుంచి రూ.500కు పెరిగిందని, నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు కనిపించడం లేదన్నారు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఇప్పటికే రూ.55 వేల కోట్ల మేర అప్పులు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం కంటే అప్పుల భారం పెరిగిపోయిందని, వడ్డీల చెల్లింపులకు కూడా ఆదాయం సరిపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన సమయంలో ముఖ్యమంత్రి పర్యటనలకు చార్టర్డ్ విమానాల కోసం రూ.50.63 లక్షలు ఖర్చు చేశారని, రెండో త్రైమాసికంలోనే రూ.39.95 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు.కరువు పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధికి విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేయడం సరికాదన్నారు. కరువు నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 26న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. సత్యసాయి జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల భూములను సమీకరించారని తెలిపారు. రైతులు తమ సొంత భూములను విక్రయించుకుని వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు భూములను అప్పగిస్తోందని ఆరోపించారు.ఎన్.పి.కుంట తదితర ప్రాంతాల్లో సోలార్ కంపెనీలకు ప్రభుత్వం వేలాది ఎకరాల భూములు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు ప్రభుత్వ లెక్కల్లోకి తీసుకున్నప్పటికీ రైతులకు నష్టపరిహారం మాత్రం ప్రస్తుత ప్రభుత్వం చెల్లించడం లేదని విమర్శించారు. టేక్‌లోడ్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఎకరాకు రూ.22 లక్షల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రూ.12.50 లక్షలు మాత్రమే భూసేకరణకు చెల్లించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. రైతులు భూములు కోల్పోయి శాశ్వతంగా వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు