12 మందిని హత్య చేసి నిర్దోషిగా తిరుగుతున్న అమిత్ షా హోం మంత్రిగా పనిచేయడం సిగ్గుచేటు
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ పేరుతో కేసులా?
జే ఈ ఈ విద్యార్థులకు పవన్ న్యాయం చేయాలి
సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ
విశాలాంధ్ర, నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా) : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చాలా ప్రమాదకరంగా మారిందని లక్షల కోట్లు దోచుకెళ్లిన కార్పొరేట్ కంపెనీల యజమానులకు వత్తాసు పలుకుతూ పేదలపై పెనుబారం మోపుతుందని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. నర్సీపట్నం కృష్ణ ప్యాలెస్ లో శుక్రవారం రాజ్యాంగ రక్షణ – లౌకికవాదం పరిరక్షణకై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా నారాయణ హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో విలువైన అటవీ సంపద, ఏజెన్సీ ఉత్పత్తులు ఉన్నప్పటికీ మన ప్రజలకి ఉపయోగపడకుండా కార్పోరేట్ కంపెనీల వారు పేదలపై పెత్తనం చలాయీస్తూ వారిని దోచుకుంటున్నారన్నారు. పాలకులకు చిత్త శుద్ధి ఉంటే విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను దేశానికి తీసుకురావాలని సవాల్ విసిరారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అణగారిన వర్గాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న తీసుకుంటున్న చర్యలు ఏమి కానరావడం లేదన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని కల్పించాల్సింది పోయి ఆ చట్టాన్ని దివాలా తీసే విధంగా చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ పేదల సొంతింటి కల నెరవేరిన దాఖలాలు ఏమి కనిపించట్లేదు అన్నారు. పేద ప్రజల సమస్యలపై కమ్యూనిస్టులు పోరాడితే అర్బన్ నక్సల్స్ పేరుతో జైల్లో పెడుతున్నారని వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర పాలకుల తీరు మారకపోతే కమ్యూనిస్టు పార్టీ నుంచి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
పార్లమెంట్లో అరకు కాఫీ ఉత్పత్తులను స్టాల్స్ లో పెట్టి గొప్పగా పాలకులు చెబుతున్నప్పటికీ కిందిస్థాయిలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. తాగే టీ దగ్గరనుంచి కలర్ ప్యాకెట్ వరకు ప్రతి ఒక్కరు ప్రజలు పన్నులు కడుతున్నప్పటికీ ఆ సొమ్మంతా ఎక్కడికి పోతుందో తెలియటం లేదన్నారు. పేద ప్రజలు క్రాప్ లోన్లు తీసుకుంటే వారిని బ్యాంకర్లు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారని అదే కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లలో రుణాలు తీసుకొని ఎగ్గొడితే వారిని మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామాన్ వంటి పాలకులు విదేశాలనుంచి దేశానికి రాకుండా కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే 22 మందికి పైగా విదేశాల్లో ఉన్నారని వారిని మోడీ కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పెద్ద ఆర్థిక నేరస్తుడని మండిపడ్డారు. 12 మంది ని హత్య చేసి నిర్దోషిగా తిరుగుతున్న వాడు మన దేశానికి కేంద్ర హోంమంత్రిగా ఉండటం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు పవన్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా మోడీ కి వంత పాడుతూ తమ ఆస్తులను కాపాడుకుంటున్నారన్నారు. గిరిజన గ్రామాలు ఖాళీ చేయించి కార్పొరేటర్ పరం చేయాలని అమిత్ షా లాంటి వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారని పేదల జోలికొస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కి ఊడిగం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఒక బఫూన్ల రాజకీయాలలో మారాడని విమర్శించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే పాలన చేస్తాడని నమ్మి జగన్ రెడ్డి ని ప్రజలు గెలిపిస్తే ప్రజలకు చుక్కలు చూపించాడు అన్నారు. కోడి కత్తి కేసు వివేక హత్య కేసులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. 11 నెలలు జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా కొమ్ముకాసి ఆయన కేసులు బయటకు రాకుండా చూస్తున్నాడన్నారు. చంద్రబాబు పవన్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వానికి దత్తపుత్రులేనని వీరి వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని, వీరి వలన ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే పోరాటాలు ఉధృత స్థాయిలో చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరుపుతున్నారని వ్యాపార లావాదేవీల్లో వాటాలు పంచుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.
జేఈఈ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా జేఈఈ పరీక్షలు రాయకుండా నష్టపోయిన విద్యార్థులకు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో మాట్లాడి న్యాయం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు నరేంద్ర మోడీ అమిత్ షా తో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని విద్యార్థుల చేత మళ్లీ పరీక్షలు రాయించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలీసుల అత్యుత్వాహంతోనే ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి రాము నాయుడు, రాజాన దొరబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

