భానుడి భగభగకు విలవిల లాడుతున్న కూలీలు.
కనీస సౌకర్యాలు కల్పించని స్థానిక అధికారులు.
అందుబాటులో లేని పీల్డ్ అసిస్టెంట్
పై అధికారుల పర్యవేక్షణ కరువు
వివరణ కోరగా మా ప్రభుత్వం ఏమి చేసుకుంటావో చేసుకో అంటున్న ఫీల్డ్ అసిస్టెంట్
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని కొండసముద్రం గ్రామంలో ఉపాధిహామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కనీస వసతులు కల్పించక పోవడంతో భానుడి భగభగకు వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వేసవి ప్రారంభం కాగానే ఎండలు మండుతుండడంతో ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీలు భానుడి వేడికి తల్లడిళ్లుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నప్పటికీ ఉపాధి కూలీలకు వసతులు కల్పించడంలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలమైనారు. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరగడంతో వేడికి, ఉక్కకు తట్టుకోలేక కూలీలు అల్లాడిపోతున్నారు. ప్రతి రోజు 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతున్న కనికరం లేకుండా వ్యవహరించడం స్థానిక అధికారుల తీరును ఎండగడుతుంది. పని ప్రదేశంలో నీరు, నీడ, ప్రధమ చికిత్స పెట్టెలు అందుబాటులో లేకపోవడంతో కూలీలు పడరాని పాట్లు పడుతున్నా, స్థానిక అధికారులు, సిబ్బందిలో చలనం లేకపోవడం తమ విధుల్లో నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. పని ప్రదేశంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఉన్నప్పటికీ, కొండసముద్రంలో మాత్రం అవి కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. ఉపాధి పనికి వచ్చే కూలీలలో మహిళలు, పెద్ద వయస్సు వారు కూడా ఉండటంతో ఎండ వేడిమికి వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
అందుబాటులో లేని పీల్డ్ అసిస్టెంట్…
పని ప్రదేశంలో కూలీలకు ఇబ్బందులు కలగకుండా నీరు, నీడ, ప్రధమ చికిత్స పెట్టెలను అందుబాటులో ఉంచి కూలీలకు వసతులు కల్పించాల్చిన పీల్డ్ అసిస్టెంట్ అసలు పని దగ్గరకు రాడని, తిరుపాలు, వెంకటేశ్వర్లు అనే వారు వచ్చి మస్టర్లు వేసి పోతారని కూలీలు చెబుతున్నారు.
కూలీలకు వసతులు కల్పించను ఎం చేసుకుంటావో చేసుకో: పీల్డ్ అసిస్టెంట్
కొండసముద్రంలో ఉపాధిహామీ పనుల వద్ద కనీస వసతులు లేవని, కూలీలు ఆనోటా, ఈనోటా అంటుండటంతో
పని పరిశీలన సమయంలో విశాలాంధ్ర ప్రతినిధి ఉపాధి కూలీలకు అందుతున్న వసతుల గురించి కూలీలను అడుగుతున్న సమయంలో మేట్ ల ద్వారా విషయం తెలుసుకున్న పీల్డ్ అసిస్టెంట్ వచ్చి పని ప్రదేశంలో కూలీలకు మేము వసతులు కల్పించం, నీవు నీ పేపర్ లో ఏమి రాసుకుంటావో రాసుకో, ఏమి చేసుకుంటావో చేసుకో, ఇది మా ప్రభుత్వం, మాకు ఏమి కాదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి, అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
వసతులు కల్పిస్తాం: ఏపీఢీ బాబూరావు.
ఈ విషయం పై కందుకూరు ఏపీఢీ బాబూరావు ని ఫోన్ ద్వారా వివరణ అడగగా పని ప్రదేశంలో కూలీలకు నీరు, నీడ తదితర వసతులు కల్పించాలని అన్నారు.పనిప్రదేశంలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని వసతులు కల్పిస్తాం అని అన్నారు. గ్రామాన్ని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.