నాలుగు నెలలుగా అందని ఉపాధిహామీ కూలీ
ఆందోళనలో కూలీలు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : గ్రామాలలో నివచించే ప్రజలు ఎక్కువ శాతం మంది రైతు కూలీలుగా పని చేస్తున్నారు. చాలీ చాలని కూలీతో ఒక పూట తిని తినక ఇబ్బందులు పడుతున్నారు. దీనతో చాలా వరకు గ్రామాల్లో నివచించే ప్రజలు బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రలకు వలసలు పోతున్నారు.
వామపక్షాల చొరవతో ఉపాధిహామీ పథకం
అలాగైనా గ్రామాల ప్రజల సమస్య ను పరిష్కరించాలని కృత నిశ్చయంతో వామపక్ష పార్టీలు 2009వ సంవత్సరంలో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పోరాడి మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకుంది. గ్రామాల్లో నివచించే ప్రజలు బతుకు తెరువు కోసం వారు నివచించే ప్రాంతాలలోనే 100 రోజులు పనిదినాలను ప్రభుత్వం కల్పించి గ్రామ ప్రజలు వలసలు బాట పట్టకుండా చేయడమే ఈ పధకం ఉద్దేశ్యం. వలేటివారిపాలెం మండలంలో మొత్తం 21 పంచాయతీ లు ఉన్నాయి. ఈ పంచాయతీ లలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఎక్కువ శాతం ఉపాధిహామీ పనులకు పోతుంటారు. కానీ వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే డబ్బులతోనే వారి జీవనం గడుస్తుంది.
నాలుగు నెలలు గడిచినా అందని కూలి డబ్బు
ఉపాధిహామీ పనులకు సంబందించిన కూలీ డబ్బు వారానికి ఒక రోజు వస్తే కూలీలకు కొంత ఉపశమనం కలుగుంది కానీ కూళీలు పని చేసిన డబ్బులు సుమారు నాలుగు నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కూలీ డబ్బులు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఒక పక్క అల్లాడుతుంటే తిండిగింజలు కొనడానికి కూడా చేతిలో డబ్బులు లేక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పొంచించు కోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి
ఇకనైనా సంబందిత అధికారులు వెంటనే స్పందించి బకాయిలు ఉన్న ఉపాధి కూలీ డబ్బులు వెంటనే వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ కూలీలు కోరుకుంటున్నారు.
కూలీ బకాయిలు వాస్తవమే
జనవరి నుండి ఇప్పటి వరకు పని దినాలకు సంబందించి కూలీ డబ్బులు బకాయిలు ఉన్న విషయం వాస్తవమే. పై అధికారులకు నివేదికను పంపించి కూలీ డబ్బులు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము.
ఏపీపీ. దయాసాగర్.