ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 7న.. కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచింది. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఇప్పటికే ఉన్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య వస్తుండటంతో.. రవాణా ఖర్చులు, వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పతనం అవుతుంటే.. దేశీయంగా ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పెంచడం గమనార్హం. క్రూడ్ రేట్లు 2021 స్థాయికి పడిపోయాయి.. రేట్లు తగ్గుతాయి అని అనుకుంటుంటే.. ఇలా రూ. 2 పెంచి కేంద్రం జేబుల్లోకి వేసుకుంటుందన్న వాదన వినిపిస్తోంది.
అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. సామాన్యులపై అంటే వినియోగదారులపై భారం పడదని.. ఆయిల్ కంపెనీలే ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపును భరిస్తాయని పేర్కొంది. ఇదే క్రమంలో.. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కూడా ప్రకటన చేశాయి. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని వెల్లడించాయి.
ఇక రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు దిగొస్తున్నాయన్న కారణంతోనే గతంలోనే విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ విండ్ ఫాల్ టాక్స్ అంటే.. దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడాయిల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై వేసే పన్ను. ఇక్కడి ఆయిల్ కంపెనీలు దేశీయంగా వెలికితీసి.. చమురును విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు సొమ్ము చేసుకుంటున్నాయన్న కారణంతో గతంలో కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ విధానం తీసుకొచ్చింది. అయితే క్రమక్రమంగా క్రూడ్ రేట్లు భారీగా పడిపోగా.. కేంద్రం దీనిని ఎత్తివేసింది. విండ్‌ఫాల్ టాక్స్ రద్దు తర్వాత దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గొస్తాయని అంచనాలు పెరిగినా అలా జరగలేదు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మాత్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని లీటరుపై రూ.2 చొప్పున తగ్గించింది. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. మన దగ్గర చూస్తే హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 95.70 వద్ద ఉంది.