విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ గడువును పొడిగించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. బుధవారము స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరు రేషన్ షాపులలో ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈనెల 30వ తేదీ లోపల ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ కార్డుదారులు సకాలంలో ఈకేవైసీ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో రేషన్ కార్డుదారులు, ముఖ్యంగా ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాల్లో ఉంటున్న వలస కూలీలు, విద్యాభ్యాస నిమిత్తం వివిధ పాఠశాలలు, కాలేజీలలో ఉంటున్న విద్యార్థులు సకాలంలో తమ స్వగ్రామాలకు వచ్చి ఈకేవైసీ చేయించుకోవడానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ప్రభుత్వం తక్షణమే కార్డుదారుల సంక్షేమం దృష్ట్యా మరో నెల రోజులపాటు గడువును పెంచి రేషన్ కార్డుదారులందరూ ఈకేవైసీ చేయించుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి తెలియజేశారు. కావున అధికారులు క్షేత్రస్థాయిన పరిశీలించి ఈకేవైసీ గడువును పెంచి రేషన్ కార్డుదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.