తిరుపతి జిల్లాకు చెందిన సురేష్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం
సంకల్పం బలంగా ఉంటే వైఫల్యాలు కూడా విజయానికి సోపానాలవుతాయని నిరూపించాడు ఓ తెలుగు యువకుడు. ఇంటర్మీడియట్‌లో ఒకప్పుడు ఉత్తీర్ణత సాధించలేకపోయిన పామూరి సురేష్, ఇప్పుడు ఏకంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 988వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తిరుపతి జిల్లాకు చెందిన సురేష్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం, గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ పదో తరగతి వరకు సాధారణ విద్యార్థిగానే కొనసాగాడు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇక చదువుకు పనికిరాడు అనే మాటలు కూడా అతడికి ఎదురయ్యాయి.
అయితే, ఈ వైఫల్యం సురేష్‌ను కుంగదీయలేదు. మరింత పట్టుదలతో నంద్యాలలో డిప్లొమా కోర్సులో చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం ఈసెట్ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించడం విశేషం. ఆపై కర్నూలులో ఇంజినీరింగ్‌ను పూర్తి చేసిన సురేష్, 2011లో జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు.
ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ, సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆశయం సురేష్‌ను నిరంతరం వెంటాడింది. ఈ లక్ష్యంతోనే 2017లో తొలిసారి సివిల్స్ పరీక్షకు హాజరయ్యాడు. కానీ మొదటి ప్రయత్నంలో ప్రిలిమినరీ పరీక్షలోనే ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దశ వరకు చేరుకున్నప్పటికీ, తుది జాబితాలో స్థానం దక్కలేదు.
ఈ క్రమంలోనే సురేష్ కొవిడ్ బారిన పడ్డాడు. దాని ప్రభావంతో వినికిడి సమస్య కూడా తలెత్తింది. అయినా తన లక్ష్యాన్ని వీడలేదు. సివిల్స్ ప్రిపరేషన్‌కు పూర్తి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో, నెలకు సుమారు రూ.1.5 లక్షల వేతనం వస్తున్న ఏఈ ఉద్యోగానికి 2020లో రాజీనామా చేశాడు. ఎన్నో సవాళ్లు, ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన ప్రయత్నాలను కొనసాగించాడు.
పట్టుదలతో ఏడోసారి సివిల్స్ పరీక్ష రాసిన సురేష్, తాజాగా విడుదలైన 2024 ఫలితాల్లో 988వ ర్యాంకు కైవసం చేసుకుని తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ఒకప్పుడు విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థి, నేడు దేశ అత్యున్నత సర్వీసుల్లో ఒకటిగా పరిగణించే సివిల్స్‌కు ఎంపిక కావడం, అతడి కృషికి, పట్టుదలకు నిదర్శనం. సురేష్ విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.