విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్లను నకిలీ విలేకరి బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్, మండల కార్యదర్శి వీరేష్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అత్యవసర ప్రథమ చికిత్స చేయాలంటే ఆర్ఎంపీ డాక్టర్లే దిక్కన్నారు. గతంలో ప్రభుత్వం కూడా ఆర్ఎంపీ డాక్టర్లను గుర్తింపు ఇస్తామని మోసం చేసిందన్నారు. అలాంటి ఆర్ఎంపీ వైద్యులను విలేకరి అని చెప్పి రకరకాలలుగా వేదించి ఒత్తిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. మండలంలో కొంత మంది నకిలీ విలేకరులు ఆర్ఎంపీ వైద్యుల వద్ద డబ్బులు ఇస్తావా వార్తలు రాయాలా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ డాక్టర్లు కూడా విధుల్లో ఏదో ఒక రూపంగా తప్పులు చేస్తున్నారని, ఆర్ఎంపీ డాక్టర్లను ప్రథమ చికిత్స చేయరాదని చెప్పడం సరికాదన్నారు. పెద్దకడబూరులో సతీష్ మెడికల్ షాపు యజమానులు మల్లికార్జున, నరసన్నలు షాపులు నడుపుతున్నారని, వీరు ఏ ఫార్మసి చేశారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు షాపు తనిఖీకి వచ్చినప్పుడు ఎందుకు షాపులను తాళాలు వేసుకో పోతున్నారన్నారు. అలాగే కొందరు నకిలీ విలేకరులు ఇసుక ట్రాక్టర్లలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలను, ఆర్ఎంపీలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, గోపాల్, రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.