విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : మండలంలోని గంగాదేవి పల్లి గ్రామంలో శనివారము ఉద్యాన శాఖ అధికారిని ఉమాదేవి ఆధ్వర్యంలో పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతులపై, ఎస్సీ రైతుల పథకాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెవికె రెడ్డిపల్లి శాస్త్రవేత్త శ్రీమతి జి .త్రికాల మాధవి హాజరై ఆమె మాట్లాడుతూ ఉద్యాన పంటలైన మామిడి, సపోటా, అల్లనేరుడు పంటలపై యాజమాన్య పద్ధతుల గురించి చెప్పారు. అలాగే మామిడిలో వచ్చు తేనె మంచి పురుగు, ఫ్రూట్ ఫ్లై గురించి చీడపీడల యాజమాన్యం పద్ధతులు రైతులకు తెలియజేశారు. అంతేకాకుండా మామిడిలో తామర పురుగు, తేనె మంచు పురుగు, అధికంగా ఉన్నప్పుడు పిప్రోనీల్ 2 ఎంఎల్, ఎసిఫేట్ 1.5 గ్రా. లీడర్ నీటి కలిపి పిచికారి చేయాన్నారు. సపోటాలో కాయ తొలిచే పురుగు నివారణకు క్లోరిపైపాస్ 2ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి చిగుళ్ళు కొమ్మలు పూర్తిగా తడిచేలాగా పిచికారి చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉద్యాన అధికారి ఉమాదేవి మాట్లాడుతూ మామిడి తోటల్లో కాయలు నిమ్మకాయ, కోడిగుడ్డు సైజులో ఉన్నప్పుడు గాలి చొరబడకుండా తొడిమ వరకు కవర్లు కట్టాలన్నారు. ఈ కాయకు కవర్ వాడటం వల్ల ఊజి ఈగ, తేనె మంచి పురుగు, మచ్చలు, తామర పురుగుల నుంచి రక్షణ ఉంటుందన్నారు. అలాగే అధిక సూర్యరస్మి , వడగండ్ల వాన నుంచి కూడా కాపాడుకోవచ్చు అన్నారు. ఎలాంటి క్రిమి కీటకాలు పండ్లను నాశనం చేయకుండా నాణ్యమైన దిగుబడి పొందొచ్చన్నారు. తొడిమ దృఢంగా తయారై కాయ పరిమాణం కూడా పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రైతులు కాయలకు కవర్లు కట్టడం వల్ల ఒక్కొక్క కవర్ 2 రూపాయలు కాగా 50 శాతం సబ్సిడీతో గరిష్టంగా ఒక హెక్టారుకు 10వేల రూపాయలు రాయితీ వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కె అధికారిని సంయుక్త, రైతులు పాల్గొన్నారు.