Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపుల్లికుంటలో అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం – రూ.4 లక్షల ఆస్తి నష్టం

పుల్లికుంటలో అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం – రూ.4 లక్షల ఆస్తి నష్టం

- Advertisement -

విశాలాంధ్ర – అమరాపురం: అమరాపురం మండల పరిధిలోని మద్దనకుంట పంచాయతీ పుల్లికుంట గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు నిరుపేద ఎస్సీ కుటుంబాలకు చెందిన పూరిగుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

గ్రామస్థుల వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో తిప్పక్కకు చెందిన గుడిసెలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు మంటలను గమనించి బయటకు వచ్చి కేకలు వేయడంతో కాలనీవాసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న రత్నమ్మ గుడిసెను కూడా పూర్తిగా ఆవరించడంతో రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో తిప్పక్క, నందీష్, రత్నమ్మ కుటుంబాలకు చెందిన ఇంటి సామగ్రి, నిత్యావసర వస్తువులు, దుస్తులు, బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు తెలిపారు. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు, అంబరీష్ స్వామి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ పరంగా తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి నిరుపేద ఎస్సీ కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, గృహోపకరణాలు అందించాలని గ్రామస్థులు, బాధితులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు